ప్రతి మనిషి జీవితంలో ఆ మూడు అంశాలు కీలకం: మంత్రి కేటీఆర్

by Disha Web Desk 19 |
ప్రతి మనిషి జీవితంలో ఆ మూడు అంశాలు కీలకం: మంత్రి కేటీఆర్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు చేయూతనిచ్చి వారికి అండగా నిలిచేందుకు ఎల్లప్పుడూ పని చేస్తోందని ఈ విషయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని బౌద్ధనగర్ సాయిబాబా కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం నిరుద్యోగ యువతీయువకులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే జిల్లాలోని పీర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు నిరుద్యోగ యువతకు చదువుకునేందుకు పుస్తకాలు ఉచితంగా అందించడంతో పాటు వారికి చేయూతనిచ్చి అన్ని విధాలుగా శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతినిత్యం రెండువేల మందికి ఉచిత భోజన వసతి సౌకర్యం కూడా కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.


ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి ఉచిత శిక్షణ కేంద్రం అని.. మంత్రి మల్లారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులను కేటీఆర్ అభినందించారు. అలాగే మూడు నాలుగు నెలల పాటు శిక్షణనిచ్చేందుకు ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న అధ్యాపకులు, బ్రహ్మాండమైన ప్రొజెక్టర్, స్క్రీన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణనివ్వడం అదే సమయంలో వారికి భోజనం, స్నాక్స్ కూడా అందించడం అక్కడే జిమ్ ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమన్నారు. అలాగే శిక్షణకు వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కోరారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం టీ–శాట్ పేరుతో విద్య, నిపుణులో 33 లక్షల మందికి టీవీలు, సెల్ఫోన్ల ద్వారా చదువు చెబుతున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అలాగే మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజుల్లోనే మరికొన్ని కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, యువత కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందని ఒక ఉద్యోగానికి పదుల సంఖ్యలో పోటీ ఉంటుందని అదే పోటీతత్వంతో మంచిగా చదువుకొని ఉద్యోగాలు పొందాలని మంత్రి కేటీఆర్ కోరారు.


అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలనే సదుద్దేశంతో ఇప్పటికే 19 వేల ప్రైవేట్ ఉద్యోగాలు ఆయా పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా వస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నాలుగున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనుండగా టీఎస్ ఐపాస్ ద్వారా సింహభాగం ఉద్యోగాలు ఇక్కడి ప్రాంత యువతీ యువకులకు దక్కుతాయని ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, ఆందోళనలు అవసరంలేదని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 15 లక్షల 62 వేల ఉద్యోగాలు రావాల్సి ఉండగా మన రాష్ట్రానికి 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మనిషి జీవితంలో మూడు అంశాలు ప్రత్యేకంగా ఉంటాయని అందులో స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అని స్కిల్ అంటే ప్రస్తుతం ఉన్న నైపుణ్యత అప్ స్కిల్ అంటే ఎప్పటికప్పుడు తమలో దాగి ఉన్న నైపుణ్యతకు పదును పెడుతూ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడమని రీ స్కిల్ అంటే కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ప్రస్తుతం ఉన్న దానిని మరింత అభివృద్ది (డెవలప్మెంట్) చేసే విధంగా ఎప్పటికప్పుడు తమలో ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ విషయంలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని లేనట్లయితే వెనుకబడిపోతామని మంత్రి కేటీఆర్ వివరించారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పగానే కేవలం 24 గంటల్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్క విద్యార్థిలో ఎంతో నైపుణ్యం దాగి ఉందని దానిని వాళ్ళ మెదడులోనే ఉంచుకోకుండా బయటకు తీసి తమ పరిజ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. ఈ విషయంలో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా సీఎం కేసీఆర్ వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను అందుబాటులో ఉంచడంతో పాటు వారి నైపుణ్యతను వినియోగించుకొంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జిల్లా కలెక్టర్ హరీశ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయర్లు వెంకట్ రెడ్డి, శివకుమార్ గౌడ్, బోడుప్పల్, జవహార్నగర్ మేయర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed