వాటికి ఆస్కారం లేకుండా.. నేరుగా వారి ఖాతాలోకే డబ్బు జమ: మంత్రి గంగుల

by Disha Web Desk 19 |
వాటికి ఆస్కారం లేకుండా.. నేరుగా వారి ఖాతాలోకే డబ్బు జమ: మంత్రి గంగుల
X

దిశ, తిమ్మాపూర్: దళితబంధుతో పథకంతో ప్రతి దళితుడు ఆర్థికంగా అభివృద్ది చెందాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ దళిత బంధు సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం గర్వించేలా తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఒక కులానికి, వర్గానికి చెందిన వ్యక్తి కాదని.. ఆయన ఈ దేశ సంపదని మంత్రి కొనియాడారు. సమానత్వం, సమసమాజ నిర్మాణానికి అనేక మంది పోరాడారని అన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో రైతులు, టీచర్లను మాత్రమే సర్ అని సంబోధిస్తారని.. మిగిలిన వారందరిని సమానంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. బ్యాంకు ప్రమేయం లేకుండా.. ఎవరి పైరవీలకు ఆస్కారం లేకుండా నేరుగా అర్హులైన లబ్దిదారుల ఖాతాలో రూ.10 లక్షలను జమ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇతర పంటలపై దృష్టిని సారించడం ద్వారా నూనె వంటి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని మంత్రి సూచించారు. దళిత బంధు లబ్ధిదారులు వారి గ్రామల్లో ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేరు వేరు యూనిట్లను పెట్టుకోవాలన్నారు. దళితబంధు కార్యక్రమం ద్వారా 9లక్షల 90వేలు అకౌంటులో జమ చేస్తారని.. మిగతా 10వేల రుపాయలు దళితరక్షణ నిధిలో జమచేయడం జరుగుతుందని వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే దళితబంధు యూనిట్లను తొందర పడకుండా.. బాగా ఆలోచించి మంచి యూనిట్లకు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చెందాలన్నారు. బ్యాంకులో జమ ఉన్న దళిత బంధు డబ్బుకు ప్రతినెల రూ.2వేలు వడ్డీ వస్తుందని తెలిపారు. రేపటి నుండే లబ్దిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దళితబంధుపై ఎవరికైన సమస్యలు ఉన్నట్లయితే కరీంనగర్ ఆర్డిఓ నోడల్ అధికారిని నియమించడం జరిగిందని.. నేరుగా ఆయనను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, ఆర్డిఓ ఆనంద్ కుమార్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed