సైనికుల నివాళిగా.. ఆల్ ఇండియా బైక్ యాత్ర చేస్తున్న కుటుంబం!

by Dishanational1 |
సైనికుల నివాళిగా.. ఆల్ ఇండియా బైక్ యాత్ర చేస్తున్న కుటుంబం!
X

దిశ, ఫీచర్స్ : కేరళకు చెందిన రాజేష్ పలేరి అనే వ్యాపారి చిన్నతనంలో ఆర్మీలో చేరాలని ఆశించాడు. కానీ పరిస్థితుల కారణంగా మరో మార్గంలో ప్రయాణించి, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు. కానీ సైనికుల పట్ల చిన్ననాటి అభిమానం అతనిలో ఇప్పటికీ అలానే ఉండిపోయింది. దీంతో 50ఏళ్ల వయసులో భారత సైన్యం పట్ల తన గౌరవాన్ని, అభిమానాన్ని ప్రత్యేకమైన రీతిలో తెలియజేయాలని నిర్ణయించుకున్న వ్యక్తి.. కుటుంబంతో సహా ఆల్-ఇండియా మోటార్ బైక్ యాత్రను ప్రారంభించడం విశేషం.

రాజేష్ కుటుంబం జూలై 16న కోజికోడ్ బీచ్ నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. దర్శకుడు-నటుడు మేజర్ రవి వీరి యాత్రను జెండా ఊపి ప్రారంభించగా.. మంగళూరు, గోవా, మహారాష్ట్ర, మనాలి, లేహ్‌లను కవర్ చేస్తూ జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు వెళ్లాలని ప్లాన్ చేశారు. రోజుకు 350కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకోగా, కుటుంబమంతా కలిసి ఇది వరకు కూడా మోటార్‌ బైక్‌పై ప్రయాణాలు చేసినప్పటికీ సుదీర్ఘమైన, సాహసోపేతమైన యాత్ర చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ప్రయాణానికి బయలుదేరే ముందు పుల్వామా అమరవీరుడు, కల్పేటలోని వసంత్ కుమార్ కుటుంబం సహా కాశ్మీర్‌లో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు గాయపడిన బ్రిగేడియర్ గంగాధరన్‌ను కలిశాడు.

ఎండవాన తేడాలేకుండా దట్టమైన హిమపాతం, తుఫాన్‌లో సైతం మాతృభూమిని రక్షించేందుకు భారత సైన్యం తీవ్రంగా శ్రమిస్తుంది. భరతమాత కోసం ప్రాణాలు కూడా లెక్కచేయని ఆ వీరుల కోసం మనం ఏం చేయగలం. అందువల్లే సైనికుల అంకితభావం, నిస్వార్థతను ప్రజలందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. అంతేకాదు శత్రువుల చేతిలో మరణించిన మన దేశ సైనికులకు నివాళిగా ఈ ఆల్-ఇండియా మోటార్‌ బైక్ యాత్రను ప్రారంభించాను. మేము మా యూట్యూబ్ చానెల్‌లో మా ప్రయాణ అప్‌డేట్స్ అందిస్తాం.

- రాజేష్ పలేరి

Next Story