గవర్నర్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 12 |
గవర్నర్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
X

దిశ, నల్లగొండ: బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించకపోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖత్వమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో గవర్నర్ సొంత ప్రసంగం ఉండదని.. కేబినెట్ ఆమోదించిన స్పీచ్‌‌నే అసెంబ్లీలో చదివి వినిపిస్తారని గుర్తు చేశారు. బహుశా కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమీ లేనట్టుంది. అందుకే ఇలా చేస్తున్నారేమో అని ఆయన అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజులు మహిళ బంధు పేరుతో ఉత్సవాలు నిర్వహించి చివరికి రాష్ట్ర ప్రథమ పౌరురాలు రాజ్యాంగాన్ని కాపాడే గవర్నర్ పదవిని కించపరచడం ఎంత వరకు సమంజసమన్నారు. సీఎంను గవర్నర్ ఎన్నడూ అవమానించలేదని ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయలేదని ఇదే సీఎం గతంలో తమిళిసైని పొగిడారని గుర్తు చేశారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించలేదో కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌కు మహిళలంటే చులకన భావన అని మొదటి నుండి కించపరచడం ఆయనకు అలవాటేనన్నారు. గవర్నర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ కు కులగజ్జి పుట్టుకుందని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను సీఎం కించపరుస్తున్నారని ఆరోపించారు. మహిళా గవర్నర్ ను అవమానించడమంటే రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించినట్లే అన్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే వని నేడు అధికార పార్టీ అడ్డుకోవడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇకనైనా ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని హితవు పలికారు. బరితెగించి ఏది పడితే అది చేస్తానంటే ప్రజలు తిరగబడతారన్నారు. పీకే తో కలిసి పనిచేసిన.. ఆ పీకేలు, గీకేలు ఏమీ చేయలేరనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, నకిరేకంటి కాశయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గండి చెరువు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed