ద‌ళితబంధు దోపిడీ.. అర్హుల‌ను కాద‌ని అనుచ‌రుల‌కు..

by Dishafeatures2 |
ద‌ళితబంధు దోపిడీ.. అర్హుల‌ను కాద‌ని అనుచ‌రుల‌కు..
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : నవ్విపోదురుగాక మాకేమి సిగ్గు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు కొంత‌మంది ఎమ్మెల్యేలు. ప్ర‌భుత్వం పేద ద‌ళితుల‌ను ఆదుకునే ఉద్దేశంతో అమ‌లు చేస్తున్న ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అప‌హాస్యం చేస్తూ అనుచ‌రుల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు, ఆర్థికంగా ఉన్నోళ్ల‌నే ప‌థ‌కానికి అర్హులుగా ఎంపిక చేస్తూ ఎమ్మెల్యేల త‌మ నిజ‌స్వరూపాన్ని ప్ర‌జ‌లకు బ‌హిర్గ‌తం చేస్తున్నారు. రాజ‌కీయ కోణాలు, ఆర్థిక అంశాల‌తో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కొంత‌మంది ఎమ్మెల్యేలు ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అప‌హాస్యం చేస్తున్నారు. పేద ద‌ళితుల‌కు స‌మ‌కూరాల్సిన ల‌బ్ధిని.. ఎమ్మెల్యేలు వారి అనుచ‌రులకు, కింది స్థాయి ప్ర‌జాప్ర‌తినిధుల‌కే కేటాయిస్తుండ‌టంతో సామాన్య జ‌నం ఔరా..! రాజ‌కీయాల్లో ఇంత దోపిడీ ఉంటుందా..? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ద‌ళిత‌బంధు ప‌థ‌కం యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ అంతా అధికారులకు బదులు స్థానిక ఎమ్మెల్యేలకు సర్కారు అప్పగించింది. 11 పూర్తి స్థాయి నియోజ‌క‌వ‌ర్గాలు, 4 పాక్షిక నియోజ‌క‌వ‌ర్గాల‌కు ల‌బ్ధిదారుల ఎంపిక ఆయా ఎమ్మెల్యేల ద్వారా జ‌రిగింది. ఈ ఎంపిక‌ల్లో అనేక అక్ర‌మాలు చోటు చేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. అర్హులైన త‌మ‌ను కాద‌ని ఆర్థికంగా, రాజకీయంగా బ‌లంగా ఉన్న నేత‌లకే ప‌థ‌కం కేటాయించిన ఎమ్మెల్యేల‌పై ద‌ళితులు శాప‌నార్థాలు పెడుతున్న జ‌నం క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అర్హులైన పేద ద‌ళితుల‌కు అందాల్సిన ద‌ళిత‌బంధు ప‌థ‌కం ఎమ్మెల్యేల రాజ‌కీయ అవ‌స‌రాల‌కు అనుగుణంగా మారిపోతోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు వారి అనుచ‌రుల‌కు, జ‌డ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, స‌ర్పంచుల‌కు, కార్పోరేట‌ర్ల‌కు, ఎమ్మెల్యేల‌, ఎంపీల బంధువుల‌కు, స్నేహితుల‌ను ల‌బ్ధిదారులుగా ఎంపిక చేస్తూ యూనిట్ల‌ను కేటాయిస్తుండ‌టం విశేషం.

ప్ర‌తిష్టాత్మ‌క ప‌థకానికి అప్ర‌తిష్ట..

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెర‌పైకి తీసుకువ‌చ్చి అమ‌లు చేసిన ద‌ళిత‌బంధు ప‌థ‌కం ప్ర‌స్తుతం ఎమ్మెల్యేల కనుస‌న్న‌ల్లోనే అమ‌లువుతున్నా ఎంతో అప్ర‌తిష్టనే మూట‌గ‌ట్టుకుంటోంది. పేద జ‌నాల‌కు అందాల్సిన ప‌థ‌కం ఆర్థికంగా, రాజ‌కీయంగా ప‌లుక‌బ‌డి ఉన్న వారే గ‌ద్ద‌లా త‌న్నుకుపోతున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారానికి ఎమ్మెల్యేలు స‌హ‌క‌రించ‌డం నిజంగా శోచ‌నీయ‌మ‌నే చెప్పాలి. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో అయితే కొంత‌మంది టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలు డ‌బ్బులు తీసుకుంటూ ల‌బ్ధిదారుల ఎంపిక‌ను చేప‌డుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. జ‌న‌గామ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఏకంగా రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. అలాగే వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, మ‌హ‌బూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఇదే విధంగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా కూడా ఆరోప‌ణ‌లున్నాయి.

బంధువుల‌కు.. అనుచ‌రుల‌కే ప్రాధాన్యమా..?!

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు కార్పోరేట‌ర్ల‌కు ద‌ళిత‌బంధు ప‌థ‌కం యూనిట్ల‌ను కేటాయించ‌డం ఇప్పుడు తీవ్ర దూమార‌మే రేపుతోంది. పేద కార్పోరేట‌ర్లని ఎంపిక చేసిన ఎమ్మెల్యేకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌పై సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజవర్గంలో ఏకంగా ఒకటి రెండు సార్లు కార్పొరేటర్లుగా గెలిచినవారు, ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు దళిత బంధు స్కీంకు అర్హులా..? అంటూ ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఈ లెక్కన నియోజకవర్గంలో ఇక వీరికంటే పేద దళితులు లేనట్టేనంటూ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ర‌ఘునాథ‌ప‌ల్లి జ‌డ్పీటీసీ బొల్లం అజ‌య్‌, ఎమ్మెల్యే తాటికొండ‌ రాజ‌య్య త‌మ్ముడు, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ మేజ‌ర్ గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్‌ తాటికొండ సురేష్‌కు ద‌ళితబంధు కేటాయించ‌డం గ‌మ‌నార్హం. ఇవి మ‌చ్చుకు ఉదాహ‌ర‌ణ‌లే. ఇలాంటి వారి సంఖ్య భారీగానే ఉంటుంది.

జిల్లాల్లో ద‌ళిత బంధు ఇలా..

హ‌న్మ‌కొండ జిల్లాలో మొత్తంగా 4149 మంది ద‌ళితుల‌కు ప‌థ‌కాన్ని అంద‌జేశారు. అయితే ఇందులో ఉపఎన్నిక‌ల హామీ నేప‌థ్యంలో ఒక్క క‌మాలాపూర్ మండ‌లంలోనే 3వేల యూనిట్లు అంద‌జేయ‌గా మిగిలినవి ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మండ‌లాల ల‌బ్ధిదారులున్నారు. ఆలెక్క‌న చూసుకుంటే మొత్తంగా స్వ‌ల్ప సంఖ్య‌లోనే ప‌థ‌కం ల‌బ్ధిదారుల‌కు చేరింది.

వ‌రంగ‌ల్ జిల్లాలో ద‌ళిత‌బంధు స్కీం కింద మొత్తం 303 యూనిట్లు మంజూరయ్యాయి. తొలి విడ‌త‌లో 303 మంది ల‌బ్ధిదారుల‌కు యూనిట్ల‌ను అంద‌జేశారు. రెండో విడ‌త కింద 1500 మందికి పంపిణీ చేస్తామ‌ని చెబుతున్నారు. తొలి విడ‌తలో వర్ధన్నపేట తప్ప మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 యూనిట్ల చొప్పున పంపిణీ జరిగాయి . అయితే మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఎంపిక జ‌ర‌గ‌లేదు. కొన్ని గ్రామాల్లోనే ఎంపిక జరిగింది.

భూపాల‌ప‌ల్లి జిల్లాలో మొత్తం 160 యూనిట్లు మంజూరు కాగా భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు 90 యూనిట్లు, మంథని నియోజకవర్గం పరిధిలో 60 యూనిట్లు మంజూర‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 115 యూనిట్లకు మొత్తం నిధుల పంపిణీ జ‌ర‌గ‌గా, 45 యూనిట్ల‌కు రూ. రెండు లక్షల చొప్పున బ్యాంకు అకౌంట్లో జమ అమ‌య్యాయి.

జనగామ జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటు 12 మండలాలకు కలిపి మొదటి దశ కింద మొత్తం 185 మందికి దళిత బంధు కేటాయించారు. ఈ పథకం కింద ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.18.5 కోట్లు వివిధ యూనిట్లకు మంజూరు చేశారు. అత్య‌ధికంగా పాల‌కుర్తికి 20 యూనిట్లు, అత్య‌ల్పంగా చిల్పూర్ మండ‌లానికి 10 యూనిట్లు కేటాయించ‌బ‌డ్డాయి.

ములుగు జిల్లాలో ద‌ళిత‌బంధు స్కీం కింద మొత్తం 120 యూనిట్లు మంజూర‌య్యాయి. తొలి విడ‌త‌లో 97 మందికి యూనిట్ల‌ను అంద‌జేశారు. ఇంకా 23 మందికి అంద‌జేసేందుకు అధికారులు ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తున్నారు. ఇందులో ములుగు నియోజ‌క‌వ‌ర్గానికే 80 యూనిట్లు అందాయి.

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో మొత్తంగా 305 ద‌ళిత‌బంధు యూనిట్లు మంజూర‌య్యాయి. డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి మొత్తం 100 యూనిట్లు మంజూరు కాగా కేవ‌లం రెండు గ్రామాల వారికే మొత్తం యూనిట్ల‌ను కేటాయించ‌డం గ‌మ‌నార్హం. అందులో ప్ర‌స్తుత ఎమ్మెల్సీ త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రెడ్డి స్వ‌గ్రామం విస్సంప‌ల్లికి -80, మ‌హ‌బూబాబాద్ జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ న‌వీన్‌రావు స్వ‌గ్రామ‌మైన బీచ్‌రాజుప‌ల్లి 20 యూనిట్లను కేటాయించి మిగిలిన గ్రామాల్లోని ద‌ళితులకు మొండిచేయి చూపారు. మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి తొలి విడ‌త‌లో 100 యూనిట్లు మంజూరు కాగా మ‌హ‌బూబాబాద్‌, కేస‌ముద్రం, నెల్లికుదురు, గూడూరు మండ‌లాల‌కు 20 చొప్పున‌- 80 యూనిట్లు, మునిసిపాలిటీ ప‌రిధిలో మ‌రో 20 యూనిట్ల‌ను కేటాయింపు చేశారు.

ఇదే జిల్లాలోని పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని తొర్రూరు, పెద్ద‌వంగ మండ‌లాల్లో 30 యూనిట్లు, ములుగు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొత్త‌గూడ‌,గంగారం మండ‌లాల‌కు 19 యూనిట్లు, ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని బ‌య్యారం మండ‌లానికి 56 యూనిట్లు మంజూరయ్యాయి. అయితే ఇల్లందు ఎమ్మెల్యే హ‌రిప్రియ‌నాయ‌క్ బ‌య్యారం మండ‌లంలోని గౌరారం అనే గ్రామానికే మొత్తం 56 యూనిట్ల‌ను కేటాయిస్తూ ల‌బ్ధిదారుల ఎంపిక‌ను చేప‌ట్ట‌డం విశేషం.


Next Story

Most Viewed