దేశీయ బంగారం పరిశ్రమలో పెట్టుబడులకు ప్రోత్సాహం అవసరం: డబ్ల్యూజీసీ!

by Dishafeatures2 |
దేశీయ బంగారం పరిశ్రమలో పెట్టుబడులకు ప్రోత్సాహం అవసరం: డబ్ల్యూజీసీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ పసిడి పరిశ్రమలో అధికారిక అడ్డంకులను తొలగించి, ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తే భారత వార్షిక బంగారం ఉత్పత్తి 1.6 టన్నుల నుంచి 20 టన్నులకు పెరుగుతుందని డబ్ల్యూజీసీ తెలిపింది. ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన నివేదికలో దేశీయ బంగారం ఉత్పత్తి, వినియోగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉంది. స్థానికంగా ఉన్న డిమాండ్ ఎక్కువ భాగం దిగుమతుల ద్వారానే నెరవేరుతోంది. 2021లో భారత్ రికార్డు స్థాయిలో 1,050 టన్నులను బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది ఓ దశాబ్దంలోనే అత్యధికమే కాకుండా 2020లో దిగుమతి అయిన 430 టన్నుల కంటే చాలా ఎక్కువ.

ఈ నేపథ్యంలో భారత్‌లో మైనింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడం ముఖ్యం. దీనికోసం ప్రభుత్వం నుంచి అధికారిక ఇబ్బందులను తగ్గించి, పెట్టుబడులను ప్రోత్సహించాలని డబ్ల్యూజీసీ ఇండియా విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోమసుందరం అన్నారు. దేశంలో మైనింగ్ లైసెన్స్ పొందడానికి అనేక విభాగాల నుంచి అనుమతుల వల్ల సుదీర్ఘ ప్రక్రియగా మారింది. దీనివల్ల పెట్టుబడులకు, ముఖ్యంగా గ్లోబల్ కంపెనీలకు ఇది సవాలుగా మారుతోందని నివేదిక పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో ఉన్న మైనింగ్ ప్రాంతాలు రోడ్డు, రైలు మార్గాలకు అనుసంధానం లేని మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. ఇది తీవ్రమైన సరఫరా ఇబ్బందులను కలిగిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.

Next Story