ములుగులో భారీ భ‌వంతులు.. ప్ర‌ణాళిక లేకుండా సాగుతున్న ప‌ట్ట‌ణాభివృద్ధి

by Dishafeatures2 |
ములుగులో భారీ భ‌వంతులు.. ప్ర‌ణాళిక లేకుండా సాగుతున్న ప‌ట్ట‌ణాభివృద్ధి
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : అట‌వీ జిల్లాగా పేరుగాంచిన ములుగులో అక్ర‌మంగా భారీ భ‌వంతులు వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమ‌తులు లేకుండానే నిర్మాణాలు జ‌రిగిపోతున్నాయి. రెసిడెన్షియ‌ల్‌ ప‌ర్ప‌స్‌లో పంచాయ‌తీ నుంచి జీప్లస్ టూకు ప‌ర్మిష‌న్స్ పొందుతున్న వారు నిర్మాణాలు మాత్రం క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్‌ రేంజ్‌లో చేప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి రెసిడెన్షియ‌ల్‌కు, వ్యాపార సంబంధ నిర్మాణాల‌కు అనుమ‌తులు కూడా వేర్వేరు శాఖ‌ల నుంచి పొందాల్సి ఉంటుంది. మేయిన్ రోడ్డులో నిర్మిస్తున్న భారీ భ‌వ‌నాల‌కు సెట్‌బ్యాక్ పాటించ‌డం లేదు. ఫైర్ సేఫ్టీతో పాటు ఇత‌ర టౌన్ ప్లానింగ్ అనుమ‌తులేవీ పాటించ‌డం లేదు. నిబంధ‌న‌ల‌కు నీళ్లోదిలేస్తూ.. అధికారులు చూస్తుండ‌గానే ప‌ని కానిచ్చేస్తున్నారు.

తోచిన‌ట్లుగా.. న‌చ్చిన‌ట్లుగా..

ములుగు న‌డిబొడ్డున అక్ర‌మ నిర్మాణాలు జ‌రుగుతున్నా అధికారులు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. వాస్త‌వానికి గ‌డిచిన ఐదేళ్లుగా ములుగు జిల్లా కేంద్రంలో వంద‌ల సంఖ్య‌లో నిర్మాణాలు జ‌రిగాయి. వ‌రంగ‌ల్‌- ములుగు జాతీయ ర‌హ‌దారి 163కి ఆనుకుని దాదాపు మూడు కిలోమీట‌ర్ల వ‌ర‌కు కూడా అనేక భ‌వ‌నాలు వెలిశాయి. ములుగు జిల్లా ఆస్ప‌త్రి చుట్టు ప‌క్క‌ల కూడా కొత్త‌గా జీప్ల‌స్ టూ అనుమ‌తుల‌ను ఉల్లంఘిస్తూ నాలుగు, ఐదంస్తుల బిల్డింగ్‌లు కూడా నిర్మాణం జ‌రిగిపోయాయి. ఈ నిర్మాణాల‌న్నీ కూడా పంచాయ‌తీ అధికారుల‌కు తెలియ‌కుండా జ‌రిగాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయినా అడ్డుకునే ప్ర‌య‌త్నం పెద్ద‌గా చేయ‌క‌పోయిన‌ట్లుగా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మెయిన్ రోడ్డుపై ఉన్న అక్ర‌మ బిల్డింగ్ నిర్మాణాల‌కు నామ‌మాత్ర‌పు జ‌రిమానాల‌తో చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రించి మ‌మ అనిపించిన‌ట్లుగా అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

టౌన్ ప్లానింగ్‌పై దృష్టేది..?!

ప‌ట్ట‌ణాభివృద్ధి బాట ప‌డుతున్న ములుగు కేంద్రంలో టౌన్ ప్లానింగ్‌ను క‌ఠిన నిబంధ‌న‌ల‌తో అమ‌లు చేయాల్సి ఉంది. ప్రారంభ ద‌శ‌లోనే నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయ‌డం ద్వారా మెరుగైన ప‌ట్ట‌ణ రూపు రేఖ‌ల‌ను తీర్చిదిద్దిన‌ట్ల‌వుతుంద‌ని ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక విభాగంలో ప‌నిచేస్తున్న ఇత‌ర జిల్లాల అధికారులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. నిర్మాణాల అనుమ‌తులు, అక్ర‌మ‌ నిర్మాణాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ, నిరోధించ‌డం ద్వారా మెరుగైన టౌన్ ప్లానింగ్‌ను సాధించ‌వ‌చ్చ‌ని పేర్కొంటున్నారు. గ్రామ పంచాయ‌తీ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వ‌ర‌కు ఎదిగిన ములుగు క్ర‌మంగా అభివృద్ధి బాట‌న ప‌డుతోంది. పొరుగున ఉండే గ్రామాల‌తో కలుపుకుంటే నాలుగేళ్ల‌లో మునిసిపాలిటీగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ ద‌శ‌లో ములుగు ప‌ట్ట‌ణంలో ఇష్టారాజ్యంగా భ‌వ‌న నిర్మాణాలు, లే అవుట్ల‌తో భ‌విష్య‌త్‌లో ప‌ట్ట‌ణ‌వాసుల‌కు చికాకులు త‌ప్ప‌వ‌న్న అభిప్రాయం ప్ర‌భుత్వంలోని కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న అధికారుల నుంచే వినిపిస్తోంది. టౌన్ ప్లానింగ్‌పై మొద‌ట్నుంచే దృష్టి పెట్టి అక్ర‌మ నిర్మాణాల‌ను అడ్డుకోవ‌డం ద్వారా భ‌విష్య‌త్ ప‌ట్ట‌ణ‌హిత కోరిన వారమ‌వుతామ‌న్న‌ది స‌త్యం.

క‌లెక్ట‌ర్ దృష్టి సారిస్తేనే...!

వాస్త‌వానికి ములుగులో రియ‌ల్ ఆగ‌డాల‌ను క‌ళ్లెం వేయాల‌ని క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య చేసిన ప్ర‌య‌త్నాలు కొంత ఫ‌లించాయి. అక్ర‌మ లే అవుట్ల‌లో నిర్మాణాల‌ను కూల్చివేయ‌డం, ప్లాట్ల హ‌ద్దురాళ్ల‌ను తొల‌గించ‌డం వంటి చ‌ర్య‌ల‌తో పాటు కొన్ని అక్ర‌మ వెంచ‌ర్ల స‌ర్వే నెంబ‌ర్ల‌పై కూడా దృష్టి సారించి రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌కుండా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ అధికారుల‌కు సూచించిన‌ట్లు స‌మాచారం. ఈనేప‌థ్యంలో రియ‌ల్ అక్ర‌మ లే అవుట్ల‌కు కాసింత క‌ళ్లెం ప‌డింద‌న్న అభిప్రాయం ములుగు జిల్లా వాసుల్లో నెల‌కొని ఉంది. ఇప్పుడు క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య టౌన్‌ప్లానింగ్‌పైనా కూడా దృష్టి సారించి అక్ర‌మ నిర్మాణాల‌ను అడ్డుకోవ‌డం ద్వారా టౌన్‌కు ప్లానింగ్ ఏర్ప‌డుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అక్ర‌మ నిర్మాణాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాం

ములుగు జిల్లా కేంద్రంలో కొన్ని అక్ర‌మ నిర్మాణాల‌పై స‌మాచారం ఉంది. కొంత‌మంది డీటీసీపీ లే అవుట్ ప‌ర్మిష‌న్ తెచ్చుకున్నామ‌ని చెబుతున్నా.. ఆధారాలు చూప‌డం లేదు. అనుమ‌తుల్లేకుండా నిర్మాణాలు జ‌రిపిన వారికి, జీ ప్ల‌స్ టు ప‌ర్మిష‌న్ తీసుకుని అంత‌కు మించిన అంత‌స్థుల‌తో నిర్మాణాలు చేప‌ట్టిన వారికి జ‌రిమానాలు విధించాం. మ‌రి కొన్నింటిని కూడా గుర్తించాం. వాటిపై ఉన్న‌తాధికారుల‌కు నివేదించి త్వ‌ర‌లోనే చ‌ర్య‌లు తీసుకుంటామని జిల్లా డీపీఓ వెంకయ్య తెలిపారు.


Next Story

Most Viewed