ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్‌‌లో అవినీతి అక్రమాలను ఊడ్చేస్తాం

by Disha Web Desk |
ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్‌‌లో అవినీతి అక్రమాలను ఊడ్చేస్తాం
X

దిశ, ఏపీ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో నీతివంతంగా సుప‌రిపాల‌న అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎలాంటి అవినీతి మరక లేకుండా పాలన అందిస్తున్న ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అప్పులు తేకుండా ప్ర‌జ‌లంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది అని ఆప్ ఏపీ ఇన్‌చార్జి మ‌ణి నాయుడు వెల్లడించారు. అవినీతి ర‌హిత పాల‌న‌కు అర‌వింద్ కేజ్రీవాల్ మారుపేరు అని.. అందుకే దేశంలోని సామాన్య ప్రజ‌లంతా కేజ్రీవాల్ రాక‌ను కోరుకుంటున్నార‌ని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. జగన్ పాలన అంతా అప్పులు, తప్పులతో నడుస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలన్నా,. అవినీతి, అక్రమాలను రూపుమాపాలన్న ఒక్క ఆప్‌తోనే సాధ్యమని ఆప్ ఇన్‌చార్జి మణి నాయుడు స్పష్టం చేశారు.

ఏపీ అభివృద్ధి ఆప్‌తోనే సాధ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన ఘోరంగా ఉంది. ఈ మూడేళ్ల కాలంలో పాల‌నంతా అప్పులు, త‌ప్పుల‌తో న‌డుస్తోంది అని ఆప్ ఏపీ ఇన్‌చార్జి మణి నాయుడు విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జిగా బాధ్యత‌లు స్వీకరించిన ఆయన ఢిల్లీ నుంచి తొలిసారి విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. విజయవాడ చేరుకున్న మ‌ణినాయుడుకు రాష్ట్ర నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంతరం ఆదివారం ఉద‌యం విజ‌య‌వాడ న‌గ‌ర వీధుల్లో ఓపెన్ టాప్ జీపులో మ‌ణినాయుడుతో క‌ల‌సి ర్యాలీ నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్, అర‌వింద్ కేజ్రీవాల్ రావాలి అంటూ కార్యక‌ర్త‌లు నినాదాలు చేశారు. అనంత‌రం మాకినేని బ‌స‌వ‌పున్నయ్య ఆడిటోరియంలో ఆప్ రాష్ట్ర స‌మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ఇన్‌చార్జిని ఆప్ నేత‌లు పోతిన వెంక‌ట‌రామారావు, క‌న్వీన‌ర్ వ‌ర ప్రసాద్, ప్రధాన కార్యద‌ర్శి కంభంపాటి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే చిన్నం రామ‌కోట‌య్య, డాక్టర్ శీత‌ల్, త‌దిత‌రులు స‌న్మానించారు.

చీపురు ఎంతో అవసరం

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలి. వ‌చ్చే ఎన్నికల‌కు రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని సిద్ధం చేసి, సాధార‌ణ ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించేలా తీర్చిదిద్దుతాం అని ఇన్‌చార్జి మణి నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ త‌ర‌హాలో సుప‌రిపాల‌న అందించాల‌ని, పంజాబ్‌లో ప్రజ‌లు ఆప్‌ని గెలిపించార‌ని గుర్తు చేశారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ కూడా త‌మ త‌ర్వాతి ప్రాధాన్యంలో ఉంద‌ని మణి నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాల‌న ఎలా ఉందో, ఢిల్లీకి వ‌చ్చే ఆంధ్రా ప్రజ‌లు త‌మ‌కు వివ‌రిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. ఇక్కడి అవినీతి అక్రమాల‌ను ఊడ్చేసేందుకు చీపురు ఎంతో అవ‌స‌రం అని మ‌ణినాయుడు వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ

రాష్ట్రంలోని కార్యకర్తల సమావేశంలో మణి నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలోపేతం చేయడంలో ప్రతీ ఒక్కరి ప్రాతినిథ్యం ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా కార్యక‌ర్త‌ల‌తో త్వరలోనే విడివిడిగా సమావేశం అవుతానని చెప్పుకొచ్చారు. ఆప్‌ని గ్రామ‌స్థాయిలో, బూత్ లెవ‌ల్లో ప‌టిష్ఠం చేస్తామ‌ని అందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క‌న్వీన‌ర్లు ఈ సమావేశంలో పాల్గొన‌గా.. వారింద‌రితో మ‌ణినాయుడు ప్రత్యేకంగా స‌మీక్ష నిర్వహించారు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఆప్ ఏపీలో గ‌ట్టి పోటీ ఇచ్చి తీరుతుంద‌ని మణి నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

భవిష్యత్ కార్యచరణ ఏంటంటే

రాష్ట్రంలో ఆప్ కార్యవర్గం ఉందని దాన్ని ప్రక్షాళన చేయాలని మణి నాయుడు భావిస్తున్నారు. అలాగే జిల్లా నాయకత్వంలో కూడా మార్పులు చేర్పులు చేయాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్ర నాయకత్వంతోపాటు జిల్లా కార్యవర్గంతో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశంపై ఒక ప్రణాళికను సిద్ధం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలకు చేరువవ్వడంతోపాటు తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు కూడా పక్కా ప్లాన్ రెఢీ చేయాలని పలువురుకి మణి నాయుడు సూచించారు. అలాగే తటస్థుల రాజకీయ అనుభవం, ప్రభావంపై కూడా ఆరా తీశారు. వీటన్నింటిపై ఒక నివేదిక రెఢీ చేయాలని ఆదేశించారు. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాదయాత్రలు చేసే అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. మరోసారి కీలక సమావేశం అనంతరం పాదయాత్రపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


Next Story

Most Viewed