చాక్లెట్‌తో హెల్తీ హార్ట్.. సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తున్న ఎక్స్‌పర్ట్స్

by Disha Web |
చాక్లెట్‌తో హెల్తీ హార్ట్.. సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తున్న ఎక్స్‌పర్ట్స్
X

దిశ, ఫీచర్స్: చాక్లెట్స్‌ను తినడాన్ని అపరాధంగా భావిస్తూనే ఆనందంగా ఉంటున్నారా? కానీ ఇకపై ఇలాంటి గిల్టీనెస్ అవసరం లేదంటున్నారు నిపుణులు. నిజానికి చాక్లెట్‌ను సూపర్‌ఫుడ్‌గా ట్రీట్ చేసే సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. చాక్లెట్ గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరమని నిర్ధారించారు. డార్క్ చాక్లెట్ హృదయనాళ వ్యవస్థకు ఆనందం కలిగిస్తుందంటున్న నిపుణులు.. దీని వల్ల హార్ట్‌కు కలిగే లాభాలను వివరిస్తున్నారు.

చాక్లెట్‌తో గుండెకు ప్రయోజనాలు:

*డార్క్ చాక్లెట్‌లో గుండెకు మేలు చేసే అనేక పోషకాలున్నాయి. దీనిలోని మెగ్నీషియం ఆరోగ్యకరమైన గుండె లయ(హెల్తీ హార్ట్ రిథమ్)ను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఊపిరితిత్తుల నుంచి గుండెతో సహా కణజాలాలకు ఆక్సిజన్‌ను బదిలీ చేయడంలో ఐరన్ హెల్ప్ అవుతుండగా.. పొటాషియం రక్తపోటును మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఇక సెలీనియం ఆక్సీకరణ ఒత్తిడి(ఆక్సిడేటివ్ స్ట్రెస్)ని అదుపులో ఉంచడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

*డార్క్ చాక్లెట్‌లోని ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ గుండెకు కూడా మేలు చేస్తుంది. చాక్లెట్‌లోని కొవ్వు కోకో బటర్ నుంచి వస్తుంది. ఇది సమాన మొత్తంలో ఒలేయిక్ యాసిడ్ (ఆలివ్ ఆయిల్‌లో ఉండే గుండె-ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు), స్టెరిక్, పాల్మిటిక్ యాసిడ్‌లతో రూపొందించబడింది. సంతృప్త కొవ్వు ఆమ్లాల(సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌)లో స్టెరిక్, పాల్మిటిక్ ఆమ్లాలు ఉన్నాయి. ఇవి అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు LDL కొలెస్ట్రాల్ (చెడు) పెరగడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి.

*డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఆర్గానిక్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో మిథైల్‌క్సాంథైన్‌లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనోల్స్, కాటెచిన్‌లు వాపును తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL)ని పెంచుతాయి. కోకోలోని ఫ్లేవనోల్స్ అని పిలువబడే బయోయాక్టివ్ పదార్థాలు పండ్లు, కూరగాయలతో పాటు కొన్ని పానీయాలలో కనిపిస్తాయి. ఇవి ధమనుల ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

* నైట్రిక్-ఆక్సైడ్‌ను పెంచే ఫ్లేవనోల్స్ యొక్క అధిక సాంద్రత కలిగిన చాక్లెట్.. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం, మెదడు పనితీరు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. కోకో బీన్ పొట్టులోని పాలీఫెనాల్స్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. నోటి దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మజీవులను తటస్థీకరిస్తాయి. దంతాల వినాశనానికి కారణమయ్యే చక్కెర మరియు పిండి పదార్థాలను యాసిడ్‌గా మార్చకుండా నిరోధించగలవు. కోకో బీన్స్‌లో థియోబ్రోమిన్ అటువంటి ప్రధానభాగం కాగా.. ఇది మిల్క్ చాక్లెట్‌లో కంటే డార్క్ చాక్లెట్‌లో అధిక మొత్తంలో ఉంటుంది.

సరైన చాక్లెట్‌ను ఎంచుకోవడం ముఖ్యం

ఆరోగ్యకరమైన సమ్మేళనాలను పొందేందుకు ఏ రకమైన చాక్లెట్‌ను ఎంచుకోవాలనేది కూడా ముఖ్యమే. చాలా చాక్లెట్ అండ్ కోకో ప్రొడక్ట్స్.. ఫ్లావనోల్‌లను తొలగించడానికి ప్రాసెస్ చేయబడ్డాయి. అందువల్ల చాక్లెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు, ఎల్లప్పుడూ మొదటి పదార్థంగా చాక్లెట్ లిక్కర్ లేదా కోకో జాబితా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే జాబితా చేయబడిన మొదటి పదార్థం ఆహార ఉత్పత్తిలో అత్యధిక మొత్తంలో ఉంటుంది. గరిష్ట గుండె ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి కనీసం 70% లేదా అంతకంటే ఎక్కువ కోకో కంటెంట్‌ని కలిగి ఉండే హై క్వాలిటీ చాక్లెట్ బార్‌లను తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన మార్గంలో చాక్లెట్‌ని చేర్చేందుకు.. ఓట్‌మీల్‌తో కలిపి అల్పాహారంగా తీసుకోవాలి లేదా వర్కౌట్ తర్వాత కొన్ని వాల్‌నట్స్, హాజెల్‌నట్స్‌తో మిక్స్ చేసి తీసుకుంటే మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి.. కనీసం 70% కోకో స్థాయి కలిగిన డార్క్ చాక్లెట్‌ను మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.


Next Story

Most Viewed