ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!

by Disha Web Desk 17 |
ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది మార్చి నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సాధిస్తుండటం, పన్ను ఎగవేతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవడం వంటి పరిణామాలతో జీఎస్టీ ఆదాయం భారీగా పెరిగినట్లు శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో వరుసగా తొమ్మిదో నెలలోనూ జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లను అధిగమించడం గమనార్హం. 'దేశవ్యాప్తంగా ఆర్థిక పునరుద్ధరణకు తోడు నకిలీ బిల్లర్లపై తగిన చర్యలు, పన్ను ఎగవేతను నిరోధించే నిర్ణయాలు జీఎస్టీ ఆదాయం పెరిగేందుకు దోహదపడ్డాయని ' మంత్రిత్వ శాఖ వివరించింది. ఫిబ్రవరిలో వసూలైన మొత్తం రూ. 1,42,095 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ(ఐజీఎస్టీ) రూ. 25,830 కోట్లు ఉండగా, స్టేట్ జీఎస్టీ(ఎస్‌జీఎస్టీ) రూ. 32,378 కోట్లు, ఐజీఎస్టీ రూ. 74,470 కోట్లు(వస్తు దిగుమతులపై వసూలైన రూ. 39,131 కోట్లతో కలిపి), సెస్ రూపంలో రూ. 9,389 కోట్లు( వస్తువుల దిగుమతులపై వసూలైన రూ. 981 కోట్లతో కలిపి) వసూలయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ కలెక్షన్లు

గతేడాదితో పోలిస్తే ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ ఆదాయం భారీగా పెరగడం గమనార్హం. సమీక్షించిన నెలలో తెలంగాణలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 4,242 కోట్లు నమోదవగా, గతేడాదిలో వచ్చిన రూ. 4,166 కోట్లతో పోలిస్తే 2 శాతం పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది మార్చిలో రూ. 3,174 కోట్లు వసూలవగా, గతేడాది రూ. 2,685 కోట్లతో పోలిస్తే ఏకంగా 18 శాతం వృద్ధి నమోదైంది.

Next Story

Most Viewed