బ్రోక‌ర్ల గుప్పిట్లో జీహెచ్ఎంసీ.. వాళ్లంటే ఆఫీసర్లకు హ‌డ‌ల్‌..!

by Disha Web Desk 12 |
బ్రోక‌ర్ల గుప్పిట్లో జీహెచ్ఎంసీ.. వాళ్లంటే ఆఫీసర్లకు హ‌డ‌ల్‌..!
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: జీహెచ్ఎంసీ ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ ఆఫీస్‌లోని టౌన్‌ప్లానింగ్ అధికారుల చేతివాటం.. అక్రమార్కుల‌కు వ‌రంగా మారుతోంది. దీంతో ప్లాన‌ర్‌లే.. బ్రోక‌ర్ల అవ‌తార‌మెత్తి ప‌నులు చ‌క్కబెడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్లాన‌ర్లను (బ్రోక‌ర్లు) చూస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు హ‌డ‌లెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. ఎల్బీన‌గ‌ర్ ఈస్ట్ జోన్ ప‌రిధిలో ఎటువంటి అనుమ‌తులు లేకుండా వెల‌సిన ఓ భ‌వ‌నం ప్రస్తుతం వాణిజ్య స‌ముదాయంగా అవ‌త‌రించిన‌ప్పటికీ.. అధికారులు మీన‌మేషాలు లెక్కిస్తూ కాలం వెల్లతీస్తున్నార‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నారు.

అక్రమ‌నిర్మాణాల‌కు అడ్డాగా మారిన జీహెచ్ఎంసీ ఎల్బీన‌గ‌ర్ ఈస్ట్ జోన్ ప‌రిధిలో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా జ‌రిగిన నిర్మాణాల‌కు కూడా క్షణాలు ఆక్యూపెన్సీ స‌ర్టిఫికెట్(ఓసీ)లు జారీ కావ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇక్కడి టౌన్ ప్లానింగ్‌ అధికారుల‌కు ఎందుకో పాన‌ర్లు (బ్రోక‌ర్లు) అంటే హ‌డ‌లెత్తిపోతున్నారు. కుక్క తోకను ఆడిస్తుందా.. లేక తోక కుక్కనాడిస్తుందా.. తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ప‌లువురు వాపోతున్నారు. ఒక్కో ఆక్యూపెన్సీ స‌ర్టిఫికెట్‌కు బ్రోక‌ర్లు సుమారు రూ 5ల‌క్షల వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నట్లు స‌మాచారం.

దీనికి తోడు ట్రాన్స్‌ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ రైట్ (టీడీఆర్‌) ప‌ర్మిష‌న్లలోనూ భారీ ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నట్లు ఆరోప‌ణలు వినిపిస్తున్నాయి. కొంద‌రు అక్రమార్కులైతే టీడీఆర్ ప‌ర్మిష‌న్ లేకుండానే నిర్మాణాలు చేప‌డుతున్నా ఎల్బీన‌గ‌ర్ న‌గ‌ర్ ఈస్ట్ జోన టౌన్‌ప్లానింగ్ అధికారులు త‌మ‌కేమీ ప‌ట్టన‌ట్లు వ్యవ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు వారికి భారీ ఎత్తున ముడుపులు అందుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. అందుకే నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్నా.. అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లడం లేద‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమ నిర్మాణాల‌కు ఆక్యూపెన్సీ స‌ర్టిఫికెట్(ఓసీ)

మూడు నుండి ఐదు అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణాల‌కు జోన‌ల్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం టౌన్ ప్లానింగ్ అధికారుల‌కు అనుమ‌తులు మంజూరు చేయాలి. జీ+2 వ‌ర‌కు ఆయా స‌ర్కిల్ కార్యాల‌యాల్లో అనుమ‌తులు పొందాలి. ఐదు అంత‌స్తుల బ‌హుళ‌ భ‌వ‌న నిర్మాణం విస్తీర్ణం 600 చ‌. గ‌జాల‌కు పైగా ఉండాలి. నిబంధ‌న‌ల‌ ప్రకారం సెట్‌బ్యాక్ క‌లిగి ఉండాలి. అగ్నిప్రమాదం వంటివి చోటు చేసుకున్నప్పుడు వాహ‌నం చుట్టూ తిరిగే విధంగా సెట్‌బ్యాక్ వ‌ద‌లాలి. 7 మీట‌ర్లకంటే ఎత్తు క‌లిగిన ప్రతి భ‌వ‌నానికి ఆక్యూపెన్సీ స‌ర్టిఫికెట్ (ఓసీ) త‌ప్పని స‌రి. భ‌వ‌న నిర్మాణం పూర్తయిన వెంట‌నే బిల్డర్ ఓసీ కాపీని ఓన‌ర్‌కు అంద‌జేయాలి. ఆక్యూపెన్సీ స‌ర్టిఫికెట్ ఉంటేనే నివాస‌యోగ్యమైన‌దిగా గుర్తింపు ఉంటుంది.

నివాసానికైనా, వాణిజ్య అవ‌రాల‌కైనా, ఆసుప‌త్రులు, ఇత‌ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఏర్పాటుకే ఆక్యూపెన్సీ స‌ర్టిఫికెట్ త‌ప్పని స‌రిగా ఉండాలి. నింధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న భ‌వ‌నాల‌కు ఆక్యూపెన్సీ స‌ర్టిఫికెట్ మంజూరు కాదు. ఒక‌వేళ త‌ప్పుడు స‌మాచారంతో మంజూరు చేసినా ఆ భ‌వ‌నానికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసే అధికారం టౌన్‌ప్లానింగ్ అధికారుల‌కు ఉంటుంది. అయితే నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న అక్రమ నిర్మాణ భ‌వ‌నాల‌కు కూడా అధికారులు ఆక్యూపెన్సీ స‌ర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ అలా జారీ చేస్తే క‌నుక స‌దురు టౌన్‌ప్లానింగ్ అధికారిపై కూడా చ‌ర్యలు తీసుకునే అధికారం ఉన్నతాధికారుల‌కు ఉంటుంది.

టీడీఆర్ లేకుండానే అద‌న‌పు నిర్మాణాలు

ట్రాన్స్‌ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ రైట్ (టీడీఆర్‌) అంటే అప్పటికే భ‌వ‌న నిర్మాణం జ‌రిగిన త‌రువాత అద‌న‌పు నిర్మాణాలు చేప‌ట్టాల‌నుకుంటే టీడీఆర్ ప‌ర్మిష‌న్ త‌ప్పని స‌రి. ఈ టీడీఆర్ అనుమ‌తులు కూడా జోనల్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలోని టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రమే మంజూరు చేయాలి. కానీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా టీడీఆర్ అనుమ‌తులు మంజూరు అవుతున్నట్లు విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ప్లాన‌ర్‌లు త‌ప్పుడు ప‌త్రాలు సృష్టించి, ఫోర్జరీ సంత‌కాల‌తో, న‌కిలీ స్టాంపుల‌తో అనుమ‌తులు పొందుతున్నట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. వీటిపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు దృష్టిపెట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు.


Next Story

Most Viewed