రికార్డు స్థాయిలో డివిడెండ్‌ను ప్రకటించిన గెయిల్ ఇండియా!

by Disha Web |
రికార్డు స్థాయిలో డివిడెండ్‌ను ప్రకటించిన గెయిల్ ఇండియా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సహజవాయువు ఉత్పత్తి, పంపిణీ సంస్థ గెయిల్ ఇండియా రికార్డు స్థాయిలో డివిడెండ్ చెల్లింపును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50 శాతం అంటే ఒక్కో షేర్‌కు రూ. 5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను నిర్ణయించింది. దీంతో మొత్తం రూ. 2,220.19 కోట్లను వాటాదారులకు చెల్లించనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ డివిడెండ్‌ను పొందేందుకు రికార్డు తేదీని మార్చి 22గా నిర్ణయించినట్టు సంస్థ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది.

అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే డిసెంబర్ నెలలో ఒక్కో షేర్‌కు రూ. 4 డివిడెండ్‌ను ఇచ్చింది. దీంతో రెండు మధ్యంతర డివిడెండ్‌లను కలిపితే రూ. 9 చెల్లించినట్టు అవుతుంది. తద్వారా మొత్తం డివిడెండ్ చెల్లింపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 3,996.35 కోట్లు అవుతుంది. ఈ నిర్ణయం ద్వారా గెయిల్ ఇండియా చరిత్రలోనే ఈ స్థాయిలో డివిడెండ్‌ను ఇస్తుండటం మొదటిసారి అని సంస్థ ఛైర్మన్, ఎండీ మనోజ్ జైన్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి గెయిల్ ఇండియాలో 51.54 శాతం వాటా ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో గెయిల్ ఇండియా నుంచి రూ. 1,142 కొట్లు రానున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఇతర వాటాదారులకు సంస్థ చెల్లించనుంది.



Next Story