ఆ జిల్లాలో అంత‌ర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్‌!

by Web Desk |
ఆ జిల్లాలో అంత‌ర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్‌!
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప‌రిధి కోహెడ‌లో ఉమ‌ర్‌ఖాన్‌గూడ (సంఘీ) నుంచి పండ్ల మార్కెట్ వ‌ర‌కు నిర్మించ‌నున్న 100 ఫీట్ల రోడ్డుకు మంత్రి స‌బిత‌, ఎమ్మెల్యే కిష‌న్‌ రెడ్డితో క‌లిసి నిరంజ‌న్‌రెడ్డి శంకుస్థాప‌న చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప‌రిధి కోహెడ‌లో అంత‌ర్జాతీయ స్థాయిలో ఆసియాలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ రూపుదిద్దుకుంటోంద‌న్నారు. భ‌విష్యత్ అవ‌స‌రాల దృష్ట్యా గ‌డ్డి అన్నారం నుంచి ఫ్రూట్ మార్కెట్‌ను త‌ర‌లించాల్సిన అవ‌స‌రం ఏర్పడిందన్నారు. పార్కింగ్‌, ట్రాఫిక్ స‌మ‌స్య తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంద‌ని చెప్పారు.

కోహెడ‌లో 178 ఎక‌రాల్లో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను నిర్మించ‌బోతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు యాక్సెస్ ఉండ‌టం, ఓఆర్ఆర్‌కు ఆనుకొని ఉండ‌టం పెద్ద సానుకూల‌త అన్నారు. ప్రణాళికాబద్ధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ మార్కెట్‌ను రూపుదిద్దేందుకు లే అవుట్ సిద్దమవుతోంద‌న్నారు.

తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో త్వరలోనే కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామ‌న్నారు. మార్కెట్‌లో ఎవరికీ ఇబ్బందులు లేకుండా నిబంధనలకు అనుగుణంగా దుకాణాల కేటాయింపు జ‌రుగుతుంద‌న్నారు. కోహెడ ఫ్రూట్ మార్కెట్‌ను సీఎం కేసీఆర్ చేతుల‌మీదుగా ప్రారంభించ‌నున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, ఆర్డీవో వెంక‌టాచారి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed