- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రైలు ప్రమాదం: పట్టాలు తప్పి ఢీకొన్న రెండు హై-స్పీడ్ రైళ్లు, 21 మంది మృతి
ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్: ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన దక్షిణ స్పేయిన్‌లోని కోర్డోబా ప్రావిన్స్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మలగా నుండి మాడ్రిడ్ వెళ్తున్న 'ఇరియో' అనే ప్రైవేట్ హై-స్పీడ్ రైలు అడముజ్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పి, పక్క ట్రాక్‌పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా మాడ్రిడ్ నుండి హుయెల్వా వస్తున్న 'రెన్ఫే' సంస్థకు చెందిన మరో రైలును ఇది బలంగా ఢీకొట్టడంతో ఈ దారుణ ఘటన సంభవించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఈ ప్రమాదం జరిగిన సమయంలో భూకంపం వచ్చినట్లు భారీ శబ్దం వినిపించింది.
ఈ ప్రమాదంలో రెండు రైళ్లు నుజ్జునుజ్జు అవ్వగా, సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 30 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి దాదాపు 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. చీకటి పడటం, ప్రమాదం జరిగిన ప్రాంతం చేరుకోవడానికి వీలు లేని చోట ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. రెస్క్యూ టీమ్స్, మిలిటరీ ఎమర్జెన్సీ యూనిట్లు ఘటనా స్థలానికి చేరుకుని, బోగీల అద్దాలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని వెలికితీశారు.
స్పేయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్, స్పానిష్ రాజకుటుంబం ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ రైళ్లు, కొత్తగా నిర్మించిన ట్రాక్‌పై ఎలా పట్టాలు తప్పాయనే దానిపై రవాణా శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ప్రస్తుతం అండలూసియా ప్రాంతం నుండి మాడ్రిడ్ వెళ్లే రైలు సర్వీసులన్నింటినీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
Read More..






