- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ సిగ్నళ్లకు బేఖాతర్..
కల్వకుర్తి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉన్నా, వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉన్నా, వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ ఎరుపు వెలిగినా పట్టించుకోకుండా వాహనదారులు దూసుకెళ్లడం, వన్‌వే నిబంధనలను బేఖాతరు చేయడం, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేయడం వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారి పట్టణం మధ్యగుండా వెళ్లడంతో ప్రధాన కూడళ్లలో రాత్రింబవళ్లు భారీగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ముఖ్యంగా పగటి వేళల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభిస్తోంది. రూల్స్‌ను పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో రోడ్డు భద్రత, పాదచారుల రక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం మహబూబ్‌నగర్ రోడ్డు నుంచి దేవరకొండ రోడ్డు వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఐరన్ డివైడర్లు, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. అలాగే మూడు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేసి, నాగర్‌కర్నూల్, పాలమూరు, హైదరాబాద్ వైపు వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నారు. రెండు ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, పలువురు వాహనదారులు నిబంధనలను పట్టించుకోవడం లేదు.
సిగ్నల్ జంపింగ్‌లో చదువుకున్న వారే ముందంజ..
ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో సామాన్యుల కంటే ఉద్యోగులు, విద్యావంతులు వంటి చదువుకున్న వారే ఎక్కువగా సిగ్నల్ జంపింగ్‌కు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క నిమిషం కూడా ఆగలేని అసహనం, చట్టాలు తెలిసిన అహంకారం, తమకు ఏమీ కాదనే నిర్లక్ష్య ధోరణితో ఎర్ర సిగ్నల్‌ను దాటేస్తున్నారు. అయితే ఈ చర్య తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమనే విషయాన్ని విస్మరిస్తున్నారు.
శివాజీ జంక్షన్‌లో నిత్యం ట్రాఫిక్ జామ్..
కూరగాయల మార్కెట్ రోడ్డులోని శివాజీ జంక్షన్, ఎల్లికల్ చౌరస్తా, చేపల బజారు, చికెన్, మటన్ దుకాణాల సముదాయాలు ఉండటంతో ఈ మార్గం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇరుకైన రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ బైకులు, కార్లు, ఆటోలు పార్కింగ్ చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా ఆదివారం వారపు సంత రోజున పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి..
ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం వన్‌వే నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, సిగ్నల్ జంపింగ్, రోడ్డుపై అక్రమ పార్కింగ్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ పెంచితేనే ప్రమాదాలు తగ్గి, రాకపోకలు సాఫీగా సాగుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.






