చెల్లికి బర్త్ డే గిఫ్ట్‌ ఇచ్చి 5 నెలల గర్భవతిని చేసిన కజిన్ బ్రదర్, స్నేహితుడు

by Disha Web |
చెల్లికి బర్త్ డే గిఫ్ట్‌ ఇచ్చి 5 నెలల గర్భవతిని చేసిన కజిన్ బ్రదర్, స్నేహితుడు
X

దిశ, చార్మినార్ : గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ నగరంలో వరస అత్యాచారాలు కలకలం సృష్టిస్తున్నాయి. అందులోనూ మైనర్ బాలికలే టార్గెట్‌గా గ్యాంగ్ రేప్‌లకు పాల్పడుతున్నారు కీచకులు. జూబ్లీహిల్స్‌లో విదేశీ బాలికపై గ్యాంగ్ రేప్... మొఘల్ పురలో మరో బాలికపై సామూహిక అత్యాచారయత్నం... చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. ఇది మరువక ముందే తాజాగా 17 సంవత్సరాల బాలికపై మరో సామూహిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుందీ ఘటన. ప్రస్తుతం బాలిక ఐదు నెలల గర్భవతి కావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఛత్రినాక ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (17) జన్మదినం సందర్బంగా వరసకు సోదరుడైన యువకుడు (32) సెల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ సెల్ ఫోన్‌కు సంబంధించిన బ్యాంక్ ప్రాసెస్ ఉందని... ఈఎంఐ కట్టేది ఉందని... నువ్వు వెంట వస్తే చాలు.. అని నేనే కట్టుకుంటా అని ఆరు నెలల క్రితం మాయమాటలతో బాలికను మలక్ పేట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. అయితే దానినే అలుసుగా తీసుకున్న కామాంధుడు చెల్లెలు అవుతుందన్న వరుస కూడా మరిచి అదేపనిగా బాలికను బెదిరిస్తూ ఆరు నెలలుగా అత్యాచారం చేయసాగాడు.

ఇదిలా ఉండగా అతని స్నేహితుడు (24) సదురు బాలికను బ్లాక్ మెయిల్ చేశాడు. మీ ఇద్దరి మధ్య జరిగేదంతా నాకు తెలుసు... నా స్నేహితుడు అంతా చెప్పేశాడని.. నేను చెప్పింది వినకపోతే అందరికి చెబుతా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భయపడిన బాలికను అతను ఇంటికి బలవంతంగా పిలిపించుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇలా ఇద్దరు యువకులు బాలికపై వరుసగా లైంగిక దాడి చేశారు. అయితే ఇటీవల బాలిక కడుపు పెద్దదిగా కనిపిస్తుండటాన్ని గ్రహించిన కుటుంబసభ్యులు బుధవారం గట్టిగా నిలదీశారు. దీంతో సదరు బాలిక జరుగుతున్న ఘోరాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి బోరుమని విలపించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసువత్రికి తీసుకెళ్లగా 5 నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాధితురాలితో కలిసి కుటుంబ సభ్యులు ఛత్రినాక పోలీసులకు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఐపీసీ 376, 376(2)(ఎఫ్ )(ఎన్ ), సెక్షన్ 3 రెడ్ విత్ 4, 5(l)(ఎన్ ), రెడ్ విత్ 6 ఫోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story