పనులు పూర్తి చేసి లక్ష్యాన్ని చేసుకోవాలి: కలెక్టర్

by Dishafeatures2 |
పనులు పూర్తి చేసి లక్ష్యాన్ని చేసుకోవాలి: కలెక్టర్
X

దిశ (జనగామ) రఘునాథపల్లి : గడువులోగా పనులు పూర్తి అయ్యేలా పర్యవేక్షణ పెంచాలని, నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి జిల్లా స్థాయిలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, మన ఊరు-మన బడి, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం కింద చేపడుతున్న పనులను సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అందుకు ఎంపీడీఓ, తహసీల్దార్, ఎస్సై బృందంగా ఏర్పడి సమన్వయంతో గ్రామాల్లో పర్యటించి యువతను భాగస్వామ్యం చేసి ప్రజా ప్రతినిధులు, దాతల సహకారంతో ప్రగతి సాధించాలన్నారు. మన ఊరు-మన బడి ప్రణాళిక కింద 176 పాఠశాలల్లో 30 లక్షలలోపు పనులను 131 పాఠశాలల్లో చేపట్టడం జరిగిందన్నారు.

జిల్లాలోని ప్రతి మండలానికి 2 పాఠశాలలను ఎంపిక చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో 12 మండలాలలోని 24 పాఠశాలల్లో పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. 30 లక్షల పైగా చేపట్టే పనులు నెలాఖరులోగా గ్రౌండింగ్ కావాలన్నారు. జనగామలోని వడ్లకొండ, పెద్ద పహాడ్‌లలో మినీ పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలన్నారు. తరిగొప్పుల మండలం వాచ్య తండా, బొత్తుల పర్రెలలో కూడా పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలన్నారు. హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో 5 అడుగుల ఎత్తు ఉన్న మొక్కలనే నాటాలని, నాటిన వెంటనే సర్కార్ తుమ్మ కంపతో రక్షణ కల్పించాలన్నారు. అటవీ శాతం 1 నుంచి 4 శాతం పెరిగేందుకు 7కోట్ల మొక్కలు నాటాల్సి ఉందన్నారు. అవసరమైతే గ్రీన్ బడ్జెట్‌తో ఎత్తుగా ఉన్న మొక్కలను కొనుగోలు చేసి అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. చెరువు కట్టలపై పెట్టరాదని, బ్యాక్ వాటర్ వైపు మాత్రమే నాటాలన్నారు. ఇండ్లకు చిన్న మొక్కలు పంపిణీ చేయడమేకాక వాటిని నాటింపజేయాలని అన్నారు. ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలన్నారు.

జనగామ శాసనసభ్యులు మాట్లాడుతూ.. అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టే మొక్కలు 5 అడుగులకు పైగా ఉండాలని, వెంటనే బ్రష్‌వుడ్ చేయాలన్నారు. పంట చెత్తను తగులబెట్టే సమయంలో హరితహారం మొక్కలు చనిపోతే జరిమానా విధిస్తూ పత్రికలలో వార్తను ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి చెట్టుకు కర్ర సపోర్ట్‌గా ఏర్పాటు చేయాలన్నారు. రైతు వేదికల్లో బౌండరీగా, క్రీడాప్రాంగణాల్లో బౌండరీగా ఎత్తుగా ఉన్న నీడనిచ్చే చెట్లను నాటింపజేయాలన్నారు. పూల మొక్కలు ముందు భాగంలో అందాన్ని ఇచ్చే విధంగా నాటించాలన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జడ్పి సి.ఈ.ఓ. విజయలక్ష్మి, డి.ఆర్.డి.ఓ. రాంరెడ్డి జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed