అధికారం కోసం బాబాయ్‌ని చంపేశారు: చంద్రబాబు నాయుడు

by Disha Web Desk 13 |
అధికారం కోసం బాబాయ్‌ని చంపేశారు: చంద్రబాబు నాయుడు
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తప్పుడు ప్రచారాలతో, సానుభూతితో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఐ-టీడీపీ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాం లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. గతంలో వైఎస్ వివేకా హత్య, కోడి కత్తి కేసులతో వైఎస్ జగన్ సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఈ నాటికి పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి అయ్యేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టును స్వార్థ రాజకీయాల కోసం ఒక బ్యారేజ్‌గా మార్చేశారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వాస్తవాలను ప్రజలకు వివరించి అధికారంలోకి వస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్లే ఐటీడీపీ కార్యకర్తల ఆయుధాలని ఇకపై వాస్తవాలు వెలికితీతలో కార్యకర్తలు ముందుండాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు. వాస్తవాలను ప్రజల ముందుంచి వైసీపీ అడ్రస్ లేకుండా చేయాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

వైసీపీని ఓడిస్తాం

2019 ఎన్నికల్లో వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. సానుభూతి పొంది వైసీపీ ఓట్లు వేయించుకుందని.. ఈ అంశాలను ప్రజల దగ్గరకు వెళ్లి వివరించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని ఓడిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందని... అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. ఈ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తే తిరిగి తనపైనే నిందులు వేస్తున్నారని చంద్రబాబు కార్యకర్తలకు వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న తప్పులన్నింటికీ తానే కారణమంటూ వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని చంద్రబాబు మండిపడ్డారు.

పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

వైసీపీ పేటీఎం బ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల కష్టాలను వెలుగులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని.. కొంతమందిని హత్యలు కూడా చేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులను ఎత్తివేస్తామని అలాగే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేద్దామని చంద్రబాబు ధైర్యం చెప్పుకొచ్చారు.

పోలవరం పూర్తి ఇంకెన్నాళ్లు?

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సోమవారం పోలవరం నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిగెత్తించానని అన్నారు. తెలుగుదేశం హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చేశామని.. మిగిలిన 28 శాతం పనులు పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వానికి మూడేళ్లు సరిపోలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో చేపట్టిన పనులే తప్ప కొత్తగా ఎలాంటి పనులు చేపట్టలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలో ఉండి ఉంటే నేటికి పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి అయ్యి ఉండేదని చెప్పుకొచ్చారు. వైసీపీ అవినీతిలో కూరుకుపోయి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో టీడీపీ పై ఆరోపణలు చేశారని.. అవినీతి జరిగిందని నానా హంగామా చేశారని ఒక్క రూపాయి అవినీతిని నిరూపించగలిగారా అని చంద్రబాబు వైసీపీ నేతలను ప్రశ్నించారు.

రూ.40 కోట్ల సుపారీ ఎవరి రక్త చరిత్ర?

ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. చేతకాని వాళ్లే కులం, మతం, ప్రాంతాలపై మాట్లాడతారని విమర్శించారు. సమర్థులు అభివృద్ధి గురించి ఆలోచన చేస్తే.. అసమర్థులు కుట్రలు, కుతంత్రాలపై దృష్టిపెడతారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజలే తన కులం, మతం, తన కుటుంబ సభ్యులని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసం సొంత బాబాయ్‌ను చంపి మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అయితే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తొలుత గుండెపోటు అని ప్రచారం చేశారని సీబీఐ విచారణలో అది గుండెపోటు కాదు గొడ్డలి పోటు అని తేలిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సీబీఐ విచారణలో అసలు హంతకులు బయటపడుతున్న తరుణంలో సిగ్గు లేకుండా సీబీఐపైనా ఎదురుదాడికి దిగుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. రూ.40 కోట్ల సుపారీ ఎవరి రక్త చరిత్ర? అని చంద్రబాబు నిలదీశారు. అంతకు ముందు కోడి కత్తి నాటకాలు ఆడారని, ఇప్పుడు కోడి కత్తి కేసు ఎక్కడ ఉందో.. ఏం జరుగుతుందో చెప్పాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. మరోవైపు అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పును బ్లూ మీడియాలో చూపించలేదన్న చంద్రబాబు వాళ్లు చూపించకపోతే ప్రజలకు వాస్తవాలు చేరకుండా ఆగాయా? అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని బట్టి చూస్తే సోషల్‌ మీడియా శక్తి ఏపాటిదో అందరూ తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. అమరావతికి కులం అంటగట్టారని.. ఒక సామాజికవర్గానికే రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని.. చివరకు స్మశానం అని కూడా అన్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. అంతేకాదు మునిగిపోతుంది..ఎడారి.. భ్రమరావతి అంటూ రాజధానిని సర్వనాశనం చేశారని ఇప్పటికైనా కళ్లు తెరవాలని చంద్రబాబు వైసీపీకి సూచించారు.

Next Story

Most Viewed