ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకి జగన్ సర్కార్ గుడ్ న్యూస్

by Disha Web Desk 12 |
ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకి జగన్ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ మేటి ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖకు వైసీపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆమెకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ కీర్తిపై చర్చ జరిగింది. అర్చరీలో ఎన్నెన్నో రికార్డులు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను.. గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి ఆమెకు సముచిత స్థానం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇకపోతే విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లలో స్వర్ణ, రజత పతకాలు గెలిచింది. అమెరికాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్‌ విభాగంలో మూడు రజత పతకాలు సాధించిన తొలి భారత ఆర్చర్‌గా సురేఖ చరిత్ర సృష్టించింది. ఇదే టోర్నీలో వ్యక్తిగత, జట్టు, మిక్సిడ్ విభాగాల్లో పతకాలు సాధించిన ఏకైక భారత్ ఆర్చర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆరు పతకాలు సాధించింది. 2017లో టీమ్‌ రజతం, 2019లో వ్యక్తిగత, టీమ్‌ కాంస్యాలు, 2021లో మూడు వెండి పతకాలు గెలిచింది. ఈ క్రమంలో ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో 5వ ర్యాంక్‌ సాధించింది. అలాగే లాన్‌కాస్టర్‌ క్లాసిక్‌ అంతర్జాతీయ ఇండోర్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో పసిడి పతకం సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ ఘనత సాధించింది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ ఇప్పటివరకూ 11 పతకాలు సాధించగా వాటిలో ఏడు పతకాలు కాంపౌండ్‌ విభాగంలో రాగా.. అందులో ఆరు పతకాల్లో సురేఖ భాగస్వామ్యం ఉంది. తన పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో జ్యోతి సురేఖ 41 అంతర్జాతీయ టోర్నీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి మొత్తం 36 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 16 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.


Next Story

Most Viewed