కేసీఆర్ వడ్లు కొను, లేదంటే గద్దె దిగు.. రాష్ట్ర సర్కార్‌పై బండి సంజయ్ ధ్వజం

by Dishafeatures2 |
కేసీఆర్ వడ్లు కొను, లేదంటే గద్దె దిగు.. రాష్ట్ర సర్కార్‌పై బండి సంజయ్ ధ్వజం
X

దిశ, వేములవాడ: వడ్ల కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ''కేసీఆర్.. 7 ఏళ్లుగా నువ్వే వడ్లు కొంటున్నట్లు ఫోజులు కొట్టినవ్ కదా.. కేంద్రం ప్రమేయమే లేదన్నవ్ కదా.. మరి ఇప్పుడెందుకు వడ్లు కొనకుండా రైతులను గోస పెడుతున్నవ్? చేతనైతే వడ్లు కొను.. చేతకాకుంటే తక్షణమే గద్దె దిగపో ''అని హెచ్చరించారు. వేములవాడలో ఈరోజు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు మూసివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతల తీరుపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. గల్లీలో ముఖం చూపలేక ఢిల్లీ వెళ్లి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అంతేకాకుండా 'రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కోతలు మొదలయ్యాయి. వడ్లను రైతులు తమ ఇళ్ల వద్ద నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. కళ్లాల వద్ద ఉన్న ధాన్యాన్ని అమ్ముకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. దీనిని అవకాశంగా తీసుకుని బ్రోకర్లు తక్కువ ధరకే వడ్లను కొనుగోలు చేస్తున్నారు. మరో 20 రోజులు దాటితే రైతుల నుండి వడ్లన్నీ బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ సమయంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుండి వడ్లు కొనాల్సిన కేసీఆర్ ప్రభుత్వం.. ఆ బాధ్యతను విస్మరించి ఢిల్లీ పోయి రాజకీయాలు చేయడం సిగ్గు చేటు' అని బండి సంజయ్ అన్నారు.

వాళ్లకు మేలు చేయడమే కేసీఆర్ పని

అయితే 'బ్రోకర్ల చేతిలోకి వడ్లన్నీ వెళ్లిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వడ్లను కొనే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే బ్రోకర్లకు మేలు చేయడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్.. వడ్లన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాతే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు సమాచారం ఉంది. అందుకోసం వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ చేతులు మారబోతున్నాయి. రైతులంతా కేసీఆర్ కుట్రలను గమనించాలని కోరుతున్నా‌' అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌కి వచ్చిన నొప్పేంది

రాష్ట్రంలో 2700 రైస్ మిల్లులుంటే.. అందులో 1700 రా-రైస్ మిల్లులు ఉన్నాయి. వాళ్లంతా వడ్లు సేకరించి ముడి బియ్యంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రైస్ మిల్లులు సిద్ధంగా ఉంటే కేసీఆర్‌కు వచ్చిన నొప్పేంది? అంటూ సంజయ్ ఎద్దేవా చేవఆరు. 'బ్రోకర్లతో కుమ్కక్కై రైస్ మిల్లర్లను కూడా బదనాం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నార'ని ఆరోపించారు. అయితే రైతులు పంట ఎందుకు కొనడం లేదని నిలదీసే అవకాశం ఉందని, అందుకే నెపాన్ని కేంద్రంపై రుద్ది కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు పేరిట కేసీఆర్ డ్రామాలాడుతున్నారు. కేసీఆర్ భాగోతాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.

బండారాన్ని బట్టబయలు చేస్తాం

'వడ్ల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది. తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి గింజను కొనేందుకు సిద్దంగా ఉంది. దీనిపై ఫిబ్రవరి 25న కేంద్రం మీటింగ్ పెడితే అన్ని రాష్ట్రాలు యాసంగి వివరాలు పంపినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బియ్యం వివరాలు అందించలేదు. తర్వాత మాట మార్చి కేంద్రమే వడ్లు కొనాలంటూ కిరికిరి పెడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడం సిగ్గు చేటు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే నాటి సమావేశ మినిట్స్ వివరాలను వెల్లడించాలి. లేనిపక్షంలో ఆ వివరాలను వెల్లడించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం' అంటూ సవాల్ విసిరారు. అనంతరం 'రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తాం. కేసీఆర్ ఢిల్లీ డ్రామాలను గల్లీలోనే ఎండగడతాం.. ప్రజలకు కేసీఆర్ బండారాన్ని బట్టబయలు చేస్తాం' అని అన్నారు.


Next Story

Most Viewed