Telangana News: పోటా పోటీ దీక్షలు.. అక్కడ టీఆర్ఎస్.. ఇక్కడ బీజేపీ

by Dishafeatures2 |
Telangana News: పోటా పోటీ దీక్షలు.. అక్కడ టీఆర్ఎస్.. ఇక్కడ బీజేపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వడ్ల కొనుగోలు అంశంపై యుద్ధం తీవ్రతరమైంది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గులాబీ శ్రేణులు పోటాపోటీ దీక్షలకు శ్రీకారం చుట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలు, మంత్రులు నిరసన దీక్ష పేరిట ఆందోళనలు చేపట్టనున్నారు. హైదరాబాద్​లో బీజేపీ నేతలు రైతు దీక్ష పేరిట తెలంగాణ సర్కార్​పై సమర శంఖం పూరించనుంది. రెండు పార్టీలూ ఒకే సమస్యపై పోరాడుతుండటం విశేషం. ధాన్యం కొనుగోలు అంశంపై రైతులను మోసం చేసేది మీరేనంటే.. మీరేనంటూ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. కాగా బీజేపీ తాజాగా వరి ధాన్యం కొను.. లేదా గద్దె దిగు అనే నినాదంతో ఇందిరా పార్క్​ వద్ద దీక్షకు సిద్ధమైంది.

తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్​మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ నేతలు ఇప్పటికే మూడు రోజుల పాటు రైతు సదస్సులు నిర్వహించారు. ప్రజలు, రైతులను మోసం చేసేది తెలంగాణ ప్రభుత్వమేనని బీజేపీ నేతలు ఈ సదస్సుల ద్వారా తెలియజేశారు. కాగా సోమవారం నిర్వహించే రైతు దీక్షతో రైతులకు మరింత అవగాహన కల్పించడంతో పాటు వరి కొనుగోలుపై తెలంగాణ సర్కార్​ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టనున్నారు. అంతేకాకుండా ఈ అంశంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకే కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. మిల్లర్లతో టీఆర్ఎస్​ నేతలు కుమ్మక్కయ్యారని గతంలో నుంచే బీజేపీ ఆరోపణలు చేస్తోంది.

మిల్లర్ల నుంచి డబ్బులు దోచుకునేందుకే పారాబాయిల్డ్ ​రైస్ ​కొనాలని టీఆర్ఎస్ ​ప్రభుత్వం పట్టుబడుతోందని కాషాయదళం విమర్శలు చేస్తోంది. గతంలో తామే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకున్న టీఆర్ఎస్ ​నేతలు చివరకు కొనేది కేంద్రమేనని ఒప్పుకున్నారు. తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మాటలు మార్చే పార్టీ టీఆర్ఎస్​అని ఈ దీక్షలో రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ శ్రేణులు టార్గెట్ ​చేయనున్నాయి. బాయిల్డ్​ రైస్​ కాకుండా రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకరించి సంతకాలు చేసినట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడంతో కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్​ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు కనీస మద్దతు ధర రూ.1960 కి కాకుండా దాదాపు రూ.500 నుంచి రూ.600 వరకు తక్కువకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు చివరకు నష్టపోవాల్సి వస్తోందని, దీనికి టీఆర్ఎస్ ​ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నేతలు డిమాండ్​ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసమే ఆందోళనల పేరుతో రైతులకు తీరని అన్యాయం చేస్తోందని కాషాయదళం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, లేదంటే గద్దె దిగాల్సిందేనని బీజేపీ హెచ్చరికలు చేస్తోంది.

ఇందిరా పార్క్​వద్ద చేపడుతున్న దీక్షకు ఎట్టకేలకు అనుమతి లభించింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ దీక్ష ప్రారంభం కానుంది. ఐదు రాష్ట్రాల్లో గెలుపు అనంతరం దూకుడు మీదున్న బీజేపీ తెలంగాణపై ఫోకస్ ​చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణ శాఖ చేపట్టే ప్రధాన కార్యక్రమాలకు కేంద్ర పెద్దలు వస్తూనే ఉన్నారు. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వీ మురళీధరన్ హాజరుకానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, పార్టీ శాసనసభ పక్ష నేత రాజా సింగ్, రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ దీక్షలో పాల్గొంటారని బీజేపీ శ్రేణుల స్పష్టం చేస్తున్నాయి.


Next Story

Most Viewed