మహారాష్ట్ర పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. సంచలనంగా మారిన గవర్నర్ డెసిషన్

by Disha Web |
మహారాష్ట్ర పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. సంచలనంగా మారిన గవర్నర్ డెసిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో ముఖ్యమంత్రి పదవికి ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయగా.. ఆయన రేపే తొలి పరీక్షను ఎదుర్కొబోతున్నారు. ఆదివారం నుండి మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ పోస్ట్ కోసం ప్రభుత్వం తరపున బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ బరిలోకి దిగారు. అయితే అతడి ఎన్నిక దాదాపుగా ఖాయం అనుకునేలోపే మహా వికాస్ అఘాడీ కూడమి అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్పీకర్ పదవి కోసం తమ వ్యక్తిని బరిలోకి దింపింది. ఎంవీఏ నుండి శివసేన ఎమ్మెల్యే రాజన్ సల్వి పోటీకి దిగారు. శనివారం ఆయన నామినేషన్ దాఖలు చేయడంతో మరాఠా రాజకీయం మరో మలుపు తీసుకుంది.

గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గుర్రు

నిజానికి మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ పదవి గత ఫిబ్రవరి నుండి ఖాళీగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలే రాజీనామా చేసినప్పటి నుండి ఆ పదవికి ఎన్నిక జరగలేదు. ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అతడు బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ సోమవారం జరగనుండగా అంతకు ముందు ఆదివారం స్పీకర్ ఎన్నికకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. అయితే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నిసార్లు కోరినా స్పీకర్ ఎన్నికకు ఒప్పుకోని గవర్నర్.. ఇప్పుడెందుకు అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ మండిపడుతోంది.

ఉద్దవ్ ఠాక్రే నిర్ణయానికి వ్యతిరేకంగా షిండే తొలి అడుగు

నూతనంగా సీఎం బాధ్యతలు స్వీకరించిన ఏక్ నాథ్ షిండే అప్పుడే తన పని మొదలుపెట్టారు. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు తన బాస్ ఉద్దవ్ ఠాక్రే చేప్పిన విధంగా ఫాలో అయిన షిండే.. ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తొలి అడుగు వేయడం సంచలనం అవుతోంది. మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును ఆరే కాలనీ నుండి కంజూర్ మార్గ్ కు తరలించాలని ఉద్దవ్ ఠాక్రే సర్కార్ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా షిండే సర్కార్ తొలి అడుగు వేసినట్లు తెలుస్తోంది. మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును తిరిగి ఆరే కాలనీలోనే చేపట్టాలని జూన్ 30న జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే ఠాక్రే ప్రభుత్వం తీసుకువచ్చిన జలయుక్త్ శివిర్ స్కీమ్ ను కూడా నిలిపివేయాలని అధికారులను ఫడ్నవీస్ ఆదేశించారని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తక్షణమే పథకాన్ని ఆపివేయాలని ఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే షిండే ప్రభుత్వ నిర్ణాయాలపై ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. తన మీద కోపం ప్రజల మీద చూపవద్దంటూ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. షిండే దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఠాక్రే సర్కార్ నిర్ణయాలకు మంగళం పాడుతారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు రాజకీయ పండితులు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed