భూముల కోసం రోడ్డెక్కిన రైతాంగం!

by Disha Web Desk 13 |
భూముల కోసం రోడ్డెక్కిన రైతాంగం!
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో రైల్వే లైన్ నిర్మాణం కింద భూములు కోల్పోతున్న భూనిర్వాసితులు భూముల కోసం, న్యాయం కోసం రోడ్డుకెక్కాలసిన పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే పుణుకున్నదని పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో-కన్వీనర్ గురిజాల గోపి అన్నారు. సోమవారం మండలంలో నియోజకవర్గ నాయకుడు బట్ట విజయ్ గాంధీ ఆధ్వర్యంలో ఒక్క రోజు బందుకు పిలుపునిచ్చి, అంబేద్కర్ సెంటర్ నుండి సురక్ష బస్టాండ్ వరకు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అఖిలపక్ష నాయకులు ఈ బందుకు పూర్తి మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం రామనుజవరం గ్రామ రైతుల గుండెలను చీల్చుతూ.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం చేస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రైల్వే లైన్ కింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం సరైన న్యాయం చేయకుండా రైతులను రోడ్డుపాలు చేసిందన్నారు. రైతులకు తెలియకుండా అధికారులు రైతుల భూముల్లో రైల్వే లైన్ పనులు చేపట్టడం దుర్మార్గమన్నారు. అడ్డు వచ్చిన రైతులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. రైతు లేనిదే.. రాజ్యం లేదని ప్రభుత్వం బూటక మాటలు చెప్పుతూ.. రైతులను హింసిస్తున్నారన్నారు.

భద్రాద్రి పవర్ ప్లాంట్ కింద భూములు కోల్పోయిన రైతులకు ఏ విధంగా న్యాయం చేశారో.. రామనుజవరం గ్రామంలో రైల్వే లైన్ కింద భూములు కోల్పోతున్న రైతులకు అదే విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి రామనుజవరం గ్రామ రైతులకు సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిచో రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, బందులు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇబ్బల్ హుస్సేన్, అశ్వాపురం మండల అధ్యక్షుడు గాదె కేశవరెడ్డి, భూర్గంపాహాడ్ నాయకులు పూలపేల్లి సుధాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు సీతారామరాజు, వైఎస్ఆర్ టీపీ నాయకులు ఉప్పల్ రెడ్డి, కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షుడు అచ్చ నవీన్, సీపీఎం ఏంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు పోరెడ్డి విజయ లక్ష్మి, తేజవత్ దేవి, బోగినేని వరలక్ష్మి, సౌజన్య, ప్రగతి తదితరులు పాల్గొన్నారు.



Next Story