తెలంగాణ గ్రామాలకు అవార్డుల పంట

by Disha Web Desk |
తెలంగాణ గ్రామాలకు అవార్డుల పంట
X

దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏటా వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణలోని 19 గ్రామాలకు నాలుగు కేటగిరీల్లో ఉత్తమ అవార్డులు లభించాయి. ఇందుల్లో ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ ఉన్న ఎర్రవెల్లి గ్రామానికి కూడా ఉత్తమ పురస్కారం లభించింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఈ నెల 24న జరుపుకుంటున్నందున తెలంగాణలో ఎంపికైన పంచాయతీల్లో కార్యక్రమాలను గ్రామసభలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాలని, అధికారులు కూడా ఇందులో పాల్గొనాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

జిల్లా కేటగిరీలో ఉత్తమ జిల్లాగా సిరిసిల్లకు గుర్తింపు లభించింది. మేజర్ పంచాయతీల (మండలస్థాయి) కేటగిరీలో వరంగల్ జిల్లా పర్వతగిరి, పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎంపికయ్యాయి. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా వనపర్తి జిల్లా చంద్రాపూర్, అభివృద్ధి ప్రణాళికలో ఉత్తమ పంచాయతీగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లి గ్రామం, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్‌కు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంతంగోడ్ ఎంపికైంది.

ఉత్తమ పంచాయతీలుగా ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా(కే), కరీంనగర్ జిల్లా వెల్చాల, మహబూబాబాద్ జిల్లా వెంకటాపురం, సిద్దిపేట జిల్లా జక్కాపూర్, బూరుగుపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా గుండ్లపోట్లపల్లి, సిరిసిల్ల జిల్లా మద్దికుంట, మండేపల్లి, వరంగల్ జిల్లా మరియపురం, పెద్దపల్లి జిల్లా నాగారం, హరిపురం గ్రామాలు ఎంపికయ్యాయి. ఉత్తమంగా ఎంపికైన గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తరఫున నగదు నేరుగా ఆయా పంచాయతీల ఖాతాల్లోకే జమ అవుతుందని పేర్కొన్నారు. గతేడాది అవార్డు పొందిన గ్రామాలకు అందిన సాయాన్ని ఏయే అవసరాలకు ఎలా ఖర్చు పెట్టారో యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ఈ నెల 15వ తేదీలోగా అందజేయాలని స్పష్టం చేశారు.

Next Story