కర్ణాటక హిజాబ్ వివాదంలో అల్ ఖైదా ఎంట్రీ: అధినేత అల్ జవహిరి వీడియో విడుదల

by Disha Web Desk 20 |
కర్ణాటక హిజాబ్ వివాదంలో అల్ ఖైదా ఎంట్రీ: అధినేత అల్ జవహిరి వీడియో విడుదల
X

దిశ‌, వెబ్‌డెస్క్ః తీవ్రవాద సంస్థ అల్ ఖైదా అధినేత, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయ్మాన్ అల్-జవహిరి సంచ‌ల‌నంగా బ‌య‌టికొచ్చాడు. ఇటీవ‌ల కాలంలో కర్ణాటకలో చెల‌రేగుతున్న‌ హిజాబ్ వివాదంపై తాజాగా ప‌బ్లిక్ కోసం ఒక వీడియో విడుద‌ల చేశాడు. క‌ర్నాట‌క‌ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, త‌న‌ను అడ్డుకుంటున్న హిందూ స‌మూహాల‌ను ఖండిస్తూ, ముస్కాన్ అనే విద్యార్థిని ఆ మ‌ధ్య నిరసన వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అల్ ఖైదా అధినేత‌ ముస్కాన్ అనే ముస్లిం అమ్మాయి చర్యను ప్రశంసించారు.

ముస్కాన్ ఖాన్ నిర‌స‌న‌ను చూసి ఎప్పుడూ క‌విత్వం రాయ‌ని తన‌కి క‌విత రాయాల‌ని అనిపించింద‌ని జ‌వ‌హిరి పేర్కొన్నాడు. తాజాగా అల్ ఖైదా విడుదల చేసిన ఈ వీడియోలో ముస్కాన్‌ను పొగుడుతూ జవహిరి ఓ కవితను వినిపించాడు. "ఆమె (ముస్కాన్) తక్బీర్లు (ఆమె నినాదాలు "అల్లాహు అక్బర్") నేను కవిని కానప్పటికీ కొన్ని పదాల కవితలు రాయడానికి నన్ను ప్రేరేపించాయి. ఈ బహుమతిని మా గౌరవనీయమైన సోదరి అంగీకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. నా నుండి కొన్ని మాటలు" అంటూ క‌విత్వాన్ని చ‌దివాడు జ‌వ‌హిరి. ముస్కాన్‌ను ప్రశంసించే త‌రుణంలో భారతదేశంలో ముస్లింల ప‌రిస్థితి, హిజాబ్ సమస్యను అనుసంధానిస్తూ మాట్లాడాడు. దీన్ని అన్యాయమ‌ని, బానిసత్వానికి సమానమని అన్నాడు. వీడియోలో, కవితా ప్రసంగంతో ముస్కాన్‌ను ఇస్లాం యోధురాలిగా పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భంగా జెరూసలేం, కాశ్మీర్ ప్రాంతాల గురించి ఎలాంటి ప్ర‌స్తావ‌నా తీసుకురాలేదు. 'హిజాబ్ సమస్య' ప్రాదేశిక ప్రభావ పరిథికి మించి సమస్య‌ను మ‌రింత పెద్ద‌ది చేసి, సెంటిమెంట్లు రెచ్చగొట్టే ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌డం విశేషం.

Next Story