పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై చర్యలు తప్పవు

by Ratna Kumari |

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రతా అధికారి విక్రమ్ హెచ్చరించారు.

పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై చర్యలు తప్పవు
X

దిశ, కామారెడ్డి: వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రతా అధికారి విక్రమ్ హెచ్చరించారు. వాహక జనిత అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్న నేపథ్యంలో మంగళవారం కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాలను మూతలు లేకుండా నిల్వ చేయడం, అపరిశుభ్రమైన వంటశాలలు నిర్వహించడం, ఆహార తయారీ సిబ్బందికి ఆరోగ్య ధృవపత్రాలు లేకపోవడం, గ్లౌజులు, హెడ్ క్యాప్‌లు ధరించకపోవడం వంటి పలు లోపాలను గుర్తించారు. సంబంధిత యాజమాన్యాలు వెంటనే లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు. వర్షాకాలంలో దోమలు, ఈగలు వంటి వాహకాల ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థలు పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆహార భద్రతా అధికారి సూచించారు. పరిశుభ్రత కోసం పాటించాల్సిన నిబంధనలు వివ‌రించారు. హోటల్, రెస్టారెంట్ పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలి, దోమలు, ఈగలు ఆహార పదార్థాల వద్దకు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార పదార్థాలను తప్పనిసరిగా మూతలతో భద్రపరచాలి, సురక్షితమైన, శుద్ధి చేసిన తాగునీటినే వినియోగించాలి, వంట, వడ్డన సిబ్బంది పరిశుభ్రమైన దుస్తులతో పాటు గ్లౌజులు, హెడ్ క్యాప్‌లు ధరించాలి, చెత్తను ప్రతిరోజూ మూత ఉన్న డస్ట్‌బిన్‌లలో సేకరించి సకాలంలో తొలగించాలని సూచించారు. నిర్దేశించిన ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని సంస్థలపై ఆహార భద్రతా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రతా అధికారి విక్రమ్ హెచ్చరించారు.

Next Story