40 ఏళ్ల తర్వాత.. భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం

by Web Desk |
40 ఏళ్ల తర్వాత.. భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం
X

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ)-2023 సెషన్ నిర్వహణ హక్కులు భారత్‌కు దక్కడం ఓ అరుదైన గౌరవమని ఐఓసీ మెంబర్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ హర్షం వ్యక్తంచేశారు. సుమారు 40 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సమావేశం నిర్వహించే అదృష్టం దక్కిందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సెషన్ నిర్వహణకు ముంబై వేదిక కానుందని, దీని ద్వారా భారత్‌లోని యువత ఒలింపిక్స్ విశేషాలను తెలుసుకునేందుకు అవకాశం లభించనుందని నీతా అంబానీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇండియాలో ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడమే మన కల అని ఆమె స్పష్టం చేశారు.

1983 ఢిల్లీలో జరిగిన ఐఓసీ సెషన్ దేశంలోనే చివరిదని, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత దీనికి ఆతిథ్యం ఇచ్చే విశిష్ఠ అవకాశం రావడం మంచి పరిణామమన్నారు. ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతున్న 139వ ఐఓసీ సెషన్‌లో భారత్ తరఫున 2008 ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా తో పాటు నీతా అంబానీ, భారత్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరిందర్ బాట్రా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌లు పాల్గొన్నారు. ఐఓసీ సెషన్‌ అనేది కమిటీ సభ్యుల సమావేశం. ఒలింపిక్స్‌కు సంబంధించిన అన్ని విషయాలను ఇందులో చర్చించాకే నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా ఏడాదికొకసారి ఈ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. కీలకమైన సెషన్లు మాత్రం ఐఓసీ అధ్యక్షుడి పర్యవేక్షణలో జరుగుతుంటాయి. ఈ కమిటీలో మొత్తం 101 సభ్యులు ఉండగా, మరో 45 మంది గౌరవ సభ్యులుగా కొనసాగుతున్నారు.


Next Story

Most Viewed