హారన్ కొట్టినందుకు కత్తులతో దాడి.. ప్రత్యేక టీం ఏర్పాటు: ఏసీపీ

by Dishafeatures2 |
హారన్ కొట్టినందుకు కత్తులతో దాడి.. ప్రత్యేక టీం ఏర్పాటు: ఏసీపీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో నలుగురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆటోలో వెళ్తున్న వారు ముందువెలుతున్న బైక్‌లు సైడ్ ఇవ్వడం లేదని హారన్ కొట్టినందుకు ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ దాడిలో కొందరికి నేర చరిత్ర ఉందని, వారిలో నలుగురిని పట్టుకున్నామని, ఇద్ధరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం.. నాగారం 80 క్వార్టర్స్‌కు చెందిన బట్టు సాయి కుమార్ తన స్నేహితులైన భాను, ప్రభాకర్, విష్ణు, సాయి కృష్ణతో కలిసి నాగారం ఒడ్డేర కాలనీలో విందులో పాల్గొన్నారు. అనంతరం రాత్రి ఆటోలో రైల్వే స్టేషన్‌కు టీ తాగేందుకు వెళ్తున్నారు.

అప్పుడే సాయి నగర్ 3 వద్ద ఆటో ముందు వెళ్తున్న రెండు బైకులు ఆటోకు సైడ్ ఇవ్వకపోవడంతో డ్రైవర్ సాయి కుమార్ హారన్ కొట్టాడు. దాంతో బైక్‌పై ఉన్న పెయింటర్ కాలనీకి చెందిన ఖాజా తీవ్రంగా ఆగ్రహించాడు. వెంటనే ఆటోను ఆపి దాడి చేశాడు. అక్కడే బైక్‌పై ఉన్న అజ్జూ ఖాన్ రెచ్చగొట్టడంతో జుబేర్, సాదాబ్, సలాం, ఫెరోజ్‌లు సాయి కృష్ణ, విష్ణుపై దాడి చేశారు. ఈ ఘటనలో ఖాజా తన వద్ధ ఉన్న కత్తితో విష్ణు, సాయి కృష్ణపై దాడి చేయగా ఈ ఘటనలో ఇద్ధరికి వీపు భాగంలో కత్తిపోట్లు దిగాయి. వారిని రాత్రి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. శుక్రవారం బాబాన్ సాహబ్ పహడ్ వద్ద సయ్యద్ ఖాజా, అబ్ధుల్ జుబేర్, మహ్మద్ షాదాబ్, షేక్ ఫెరోజ్‌లను అరెస్టు చేశామని ఏసీపీ తెలిపారు.

ఈ కేసులో అందరినీ రెచ్చగొట్టిన ఎ2 అజ్జూ ఖాన్, ఎ4 సలాం పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. అజ్జూ ఖాన్‌పై గతంలో హత్యాయత్నం, బైక్‌ల చోరి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పరారీలో ఉన్న అజ్జూ ఖాన్, సలాం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ జగడం నరేష్, ఐదవ టౌన్ ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్‌లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed