ఆసక్తికరంగా వేములవాడ పాలిటిక్స్.. అన్నాదమ్ముళ్ల మధ్య ఫైట్!

by Disha Web Desk 2 |
ఆసక్తికరంగా వేములవాడ పాలిటిక్స్.. అన్నాదమ్ముళ్ల మధ్య ఫైట్!
X

దిశ, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ పోరు గతంలో కంటే ఈసారి ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశకు బీఆర్ఎస్ టికెట్ రాలేదు. జర్మనీ పౌరసత్వ వివాదం నేపథ్యంలో ఆయనకు టికెట్ నిరాకరించారు. దీంతో ఆ సీటును చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు కేటాయించారు. అయితే.. టికెట్ దక్కలేదని ఎమ్మెల్యే రమేశ్ అసంతృప్తితో ఉండడంతో సీఎం కేసీఆర్ ఇటీవల ఆయనకు వ్యవసాయ సలహాదారు బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థిని గెలిపించుకోవడం ఇప్పుడు రమేశ్ బాబుకు సవాల్ గా మారింది. పార్టీ, బంధుత్వం మధ్య ఎవరిని గెలిపించుకో వాలనేది ఆయనకు పెద్ద టాస్క్‌లా తయారైంది.

గెలిస్తే క్రెడిట్.. ఓడితే నిందలు..

చెన్నమనేని రమేశ్ వేములవాడ నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఆయనకు స్థానికంగా ఉన్న గుర్తింపు పలుకుబడి ఈసారి పార్టీ తరఫున పోటీచేస్తున్న చల్మెడ లక్ష్మీనరసింహారావుకు మళ్లించడం రమేశ్‌కు బాధ్యతగా మారింది. మరోవైపు బీజేపీ తరఫున చెన్నమనేని వికాస్ పోటీ చేయనున్నారు. ఈయన రమేశ్‌కు వరుసకు సోదరుడు. సమీప బంధువు. ఒకవైపు దగ్గరి బంధుత్వం, మరోవైపు పాలిటిక్స్.. ఈ రెండింటి నడుమ చాకచక్యంగా వ్యవహరించడం చెన్నమనేని రమేశ్‌కు సవాల్‌గా మారింది. ఈ పరిస్థితిలో ఆయన పార్టీ వైపు నిలబడటమా.. లేక బంధుత్వానికి ప్రాధ్యాన్యత ఇవ్వడమా అనేది అగ్నిపరీక్షగా తయారైంది.

సొంత పార్టీ తరుఫున బరిలో నిలుస్తున్న లక్ష్మీ నరసింహరావు గెలిస్తే రమేశ్ సహకారం పుష్కలంగా లభించిందన్న క్రెడిట్ దక్కుతుంది. ఒకవేళ ఊహకు అందని విధంగా అంచనా తప్పి ఓటమిపాలైతే చెన్నమనుని సహకరించలేదని నిందను మోయాల్సి వస్తుంది. పార్టీకన్నా బంధుత్వానికే ప్రయారిటీ ఇచ్చారన్న అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటి నడుమ చెన్నమనేని రమేశ్ వ్యవహారం ఎలా ఉంటుందనేది స్థానికంగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు జిల్లాలో చాలాకాలం నుంచే చెన్నమనేని, చల్మెడ కుటుంబాల మధ్య వైరం ఉన్నది. రెండు కుటుంబాలు ఒకే సామాజిక వర్గానికి చెందినా తూర్పు, పడమర తరహాలోనే సంబంధాలు ఉన్నాయి.

Next Story