అందరి దృష్టి పొంగులేటి సభపైనే.. కాంగ్రెస్‌లో చేరికపై ఆలోచన!

by Disha Web Desk 2 |
అందరి దృష్టి పొంగులేటి సభపైనే..  కాంగ్రెస్‌లో చేరికపై ఆలోచన!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్‌ను వివిధ రాజకీయ పార్టీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్తులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కర్ణాటకలోని డీకే ఆదేశాలు నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆచరణల వరకు అంతా గమనిస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్నాడన్న ప్రచారం జరుగుతున్నది. ఈ నెలాఖరుకు చేరిక సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని పొంగులేటి అనుచరులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇతర పార్టీల్లోని అంసతృప్తి నేతలు ఇప్పుడు ఈ సభపైనే ఫోకస్ పెట్టారు. సభకు ఎంత మంది వస్తారు? ఏ మేరకు ప్రభావం చూపుతుంది? హై కమాండ్ పొంగులేటికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి? అనే అంశాలను పరిశీలించనున్నారు. దాని బట్టి కాంగ్రెస్‌లోకి చేరాలా? వద్దా? అని తేల్చుకుంటామని కాంగ్రెస్​పార్టీ ఆహ్వానం పొందిన ఓ బీఆర్ఎస్‌లోని అసంతృప్తి నేత తెలిపారు.

ఏది బెటర్..?

దేశ, రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా ఏ పార్టీలోకి చేరితే బాగుంటుందని పలువురు లీడర్లు రాజకీయ పండితులు, విశ్లేషకులను సంప్రదిస్తున్నారు. మళ్లీ పార్టీ మారకుండా ఉండే విధంగా సూచించాలని కోరుతున్నట్లు తెలిసింది. ప్రతి రోజూ కనీసం ముగ్గురు నుంచి నలుగురు ముఖ్య లీడర్లు తమకు కాల్ చేసి ఫీడ్​బ్యాక్​తీసుకుంటున్నట్లు ఓ పొలిటికల్ ఎనాలిస్ట్ తెలిపారు. దీంతో పాటు ఆఫీసర్లు, మేధావులు నుంచి కూడా నేతలు అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. పార్టీలో చేరిన తర్వాత ఆచితూచి ఆడుగులు వేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అసంతృప్తి నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో హడావుడిగా తీసుకున్న నిర్ణయంతో ఓ మాజీ మంత్రి ఆ పార్టీలో ఇమడ లేక డైలమాలో ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా నేత తెలిపారు.

సమన్వయం చేస్తారా...?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల్లో చేరికలు సహజంగానే కొనసాగుతాయి. పవర్‌లోకి ఉన్న పార్టీతో పాటు అధికారంలోకి వస్తుందని ప్రచారం జరుగుతున్న పార్టీల్లోకి ఎక్కువగా చేరికలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్య నేతలు చేరిన తర్వాత తగిన ప్రయారిటీ లభిస్తుందా? లేదా? అనే అంశాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్​పార్టీ నుంచి ఆహ్వానం పొందిన నేతలు ఎక్కువగా దీని గురించే ఆలోచిస్తన్నారు. టిక్కెట్లు లభిస్తాయా? ఇచ్చినా.. మొదట్నుంచి ఉన్న కార్యకర్తలు, నేతలు సహకరిస్తారా? లేదా అని టెన్షన్​పడుతున్నారు. లేదా.. నేరుగా హై కమాండ్ పార్టీలోకి వచ్చిన వారికి సపోర్టు చేయాలని సూచిస్తుందా? అనేది అసంతృప్తి నేతలు వేచిచూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో సీనియర్​నేత వీహెచ్​కొత్తగా వచ్చినోళ్లకు పార్టీలో పదవులు, సీట్ల విషయంలో అంతా ప్రాధాన్యం ఇవ్వొద్దని బహిరంగంగానే హైకమాండ్‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్​పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతున్నదని పలువురి అసంతృప్తి నేతలు పొంగులేటి పార్టీ చేరిక అంశాన్ని ఆసక్తిగా మానిటరింగ చేయడం గమనార్హం.

Next Story