బిగ్ న్యూస్: గజ్వేల్ బరిలో రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా TPCC చీఫ్ భారీ స్కెచ్..?

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: గజ్వేల్ బరిలో రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా TPCC చీఫ్ భారీ స్కెచ్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దమ్ముంటే కేసీఆర్ ఈసారి కూడా గజ్వేల్ నుంచే పోటీ చేయాలి.. అంటూ ఛాలెంజ్ చేయడం వెనక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పక్కా ప్లానే ఉన్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సెగ్మెంట్ నుంచి రేవంత్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. కుంభస్థలాన్ని కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. సొంతగా చేయించుకున్న సర్వేలో వచ్చిన ఫీడ్ బ్యాక్‌తో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితుల సమాచారం.

తొమ్మిదేళ్ళ పాటు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించానని గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలంటూ పదేపదే రేవంత్ కామెంట్ చేస్తున్నారు. గజ్వేల్ నుంచి కాకుండా మరో చోట పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు రేవంత్ ఈ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

ఒకవైపు సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి పోటీ చేస్తానని గతంలోనే రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్‌లోకి చేరికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆ స్థానం మరొకరికి ఇవ్వాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నందునే దానికి బదులుగా గజ్వేల్‌ బరిలో నిలవాలనుకుంటున్నట్లు తెలిసింది.

కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్న జోష్‌తో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ధీమాతో గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఓటమి తప్పదనే భావనతో ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఈసారి గజ్వేల్‌ నుంచి షిప్ట్ అవుతున్నట్లు రేవంత్ పసిగట్టారు. ఒకవేళ ఆ స్థానాన్ని కేసీఆర్ మరోసారి ఎంచుకున్నా స్వయంగా తానే నిలబడి ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అందువల్లే పదేపదే దమ్ముంటే.. అంటూ సవాలు విసురుతున్నారు.

స్వయంగా తాను పోటీ చేయాలనుకుంటున్న అంశాన్ని వెల్లడించకుండా కేసీఆర్‌ను రెచ్చగొడుతున్నారు. పోటీ చేస్తే ఓడించిన క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఆ స్థానం నుంచి తప్పుకుంటే భయపడి పారిపోయారని ప్రచారం చేసుకోనున్నారు. గజ్వేల్‌లో గతంలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు 2014, 2018 ఎన్నికల్లో పోలైన ఓట్లు, ఈసారి కాంగ్రెస్‌‌కు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన గ్రాఫ్‌తో అక్కడ కూడా పెరిగే ఆదరణ తదితరాలన్నింటినీ గమనంలోకి తీసుకుని పీసీసీ చీఫ్ హోదాలో నిలబడి మిగిలిన సెగ్మెంట్లలో అభ్యర్థులకు భరోసా పెంచాలనేది రేవంత్ వ్యూహం. గ్రామాలవారీగా ఓటర్ల నాడిని తెలుసుకున్న తర్వాతనే రేవంత్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సన్నిహితుల సమాచారం.

Read more :

ఐదు రోజులుగా ఫాంహౌజ్‌లోనే KCR మకాం.. అసలేం జరుగుతోందంటూ బీఆర్ఎస్‌లో జోరుగా చర్చలు..!

చంద్రబాబు నాయుడి వారసుడే రేవంత్ రెడ్డి : Minister Thanneeru. Harish Rao



Next Story

Most Viewed