ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ బుజ్జగింపులు.. కాంగ్రెస్‌ నేతతో భేటీ వేళ అప్రమత్తం

by Dishafeatures2 |
ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ బుజ్జగింపులు.. కాంగ్రెస్‌ నేతతో భేటీ వేళ అప్రమత్తం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌లో సీటు దక్కని నేతలు ఇతర పార్టీలలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళుతున్నారు. ఇప్పటికే ఘానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్, పాలేరుకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ దక్కకపోవడంతో హస్తం గూటికి చేరేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌లో సీటు దక్కని స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

సోమవారం వరంగల్‌లోని ఒక హోటల్‌లో మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహాతో రాజయ్య రహస్యంగా భేటీ కావడం కలకలం రేపింది. ఈ సమావేశంతో ఆయన బీజేపీలో చేరుతారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి రాజయ్యకు ఆహ్వానాలు వస్తున్ను క్రమంలో దామోదరతో భేటీ కావడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఆయన హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమనే ప్రచారం నడుస్తోంది. ఈ వార్తల క్రమంలో రాజయ్యను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మధ్యవర్తులను పంపిస్తోంది.

మంగళవారం రాజయ్యను వరంగల్ పశ్చిమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కలిశారు. పార్టీలోనే ఉండాల్సిందిగా రాజయ్యను బుజ్జగించినట్లు తెలుస్తోంది. అయితే స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంపై రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్ దక్కనందుకు ఆయన మీడియా ముందు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. దీంతో పార్టీలో కడియంతో కలిసి రాజయ్య పనిచేసే అవకాశం కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మద్దతిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రాజయ్య భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది హాట్‌టాపిక్‌గా మారింది.



Next Story