కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా ముఖ్యమంత్రి అవుతాడు: ఎంపీ

by Disha Web Desk 2 |
కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా ముఖ్యమంత్రి అవుతాడు: ఎంపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే కేసీఆర్ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమాన్షు రావు.. ముఖ్యమంత్రి అవుతారని, ఆ ఒక్క కుటుంబం నుంచే సీఎంలు అవుతారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోసపూరిత హామీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఒక్కసారి మోడీ పాలనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తొమ్మిదేళ్లుగా కుటుంబ ప్రమేయం లేకుండా, వారసత్వ రాజకీయాలు లేకుండా అవినీతికి, దళారీలకు అవకాశమే లేకుండా అందించిన పాలనను చూడాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులేనని లక్ష్మణ్ విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల పాలన తెలంగాణ ప్రజలు చూశారని, బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తిచేశారు. బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తానన్న బీజేపీ గురించి ఆలోచించాలన్నారు. బీజేపీలో బీసీలు అనేకమంది ఉన్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే చరిత్ర బీజేపీకి, మోడీకి ఉందన్నారు. బీసీలు ఈ సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని రిక్వెస్ట్ చేశారు.


ఇకపోతే వివేక్ వెంకటస్వామి పార్టీలోనే ఉంటారని, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా చక్కటి మేనిఫెస్టో ఇచ్చారన్నారు. ఆరు నెలలుగా వివేక్ వెంకటస్వామిపై ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉందని, ఆయన కూడా పలుమార్లు ఖండించారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రచారంలో బీజేపీ ఎక్కడా వెనుకంజ వేయలేదని ఆయన తెలిపారు. బుధవారం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుందని, తెలంగాణలో మిగతా స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపాలన్నారు. దాడి జరిగింది వ్యక్తిగత కారణాల వల్లా? లేక రాజకీయ కారణాల వల్లనా అనేది తేల్చాలన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన వచ్చాక పొత్తుపై క్లారిటీ వస్తుందన్నారు. కార్యాచరణను అప్పుడే ప్రకటిస్తారని లక్ష్మణ్ తెలిపారు.

Also Read..

కేసీఆర్ వస్తుంటే ప్రతిపక్షాల్లో వణుకు పుట్టింది : కేటీఆర్



Next Story

Most Viewed