భయంతో వణికిపోతున్న అధికారులు.. ఎన్నికలు ముగిసే వరకూ టెన్షన్.. టెన్షన్..!

by Disha Web Desk 2 |
భయంతో వణికిపోతున్న అధికారులు.. ఎన్నికలు ముగిసే వరకూ టెన్షన్.. టెన్షన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భయంపట్టుకున్నది. రెండు రోజుల క్రితం ఒకే సారి 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడమే ఇందుకు కారణం. మొన్నటి వరకు ప్రగతిభవన్ వర్గాల సూచన మేరకు నిర్ణయాలు తీసుకున్న ఆఫీసర్లు ఇప్పుడు వణికిపోతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందేమోనని ఆందోళన వారిలో మొదలైంది. అటు ఈసీకి కోపం తెప్పించకుండా.. ఇటు రూలింగ్ పార్టీకి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకోవడం వారికి కత్తిమీద సాముగా మారిందనే చర్చలు మొదలయ్యాయి. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం అవుతుందోననే ఆందోళన ఎన్నికల పక్రియలో ప్రమేయం ఉండే ఆఫీసర్లను వెంటాడుతున్నది. అందుకే డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. తమ నిర్ణయాన్ని ఈసీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో, అది రూలింగ్ పార్టీకి ఏమైనా ఇబ్బందిగా మారుతుందా? అనే అనుమానాలు ఆఫీసర్లను వెంటాడుతున్నట్టు టాక్. దీంతో కొందరు ఐఏఎస్‌లు.. రిటైర్డ్ సీఎస్‌ల సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

ఎన్నికలు ముగిసే వరకు..

మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రగతిభవన్ వర్గాలతో మొన్నటి వరకు సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఇప్పుడు వారికి అంటీముట్టనట్టుగా ఉంటున్నారని సమాచారం. ఏదైన సమాచారం కోసం రూలింగ్ పార్టీకి చెందిన నాయకులు ఫోన్లు చేసినా సదరు అధికారులు పొడిపొడిగా మాట్లాడుతున్నట్టు తెలిసింది. కొందరు అధికారులైతే ఎన్నికలు ముగిసే వరకు తమకు ఫోన్ చేయొద్దని లీడర్లకు స్పష్టం చేస్తున్నట్టు టాక్. ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు అన్ని పార్టీలతో సమాన దూరం పాటించడం మంచిదనే అభిప్రాయం ఆఫీసర్లలో వ్యక్తమవుతున్నది. ‘ఫోన్లలో ఏం మాట్లాడితే ఏం అవుతుందో తెలియదు. నిత్యం సెంట్రల్ ఇంటిలిజెన్సీ నిఘా ఉంటుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు రూల్స్ పాటించక తప్పుదు’ అని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు.

మెప్పు ముప్పు..

తాజాగా ఈసీ వేటు వేసిన 20 మంది ఆఫీసర్ల పనితీరుపై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. పోస్టింగ్ కోసం ప్రగతిభవన్ వర్గాలను ప్రసన్నం చేసుకోవడం, పోస్టింగ్ వచ్చిన తర్వాత పాలకుల మెప్పుకోసం పనిచేయడమే ఈసీ ఆగ్రహానికి కారణమైందనే ప్రచారం జరుగుతున్నది. కొందరు ఆఫీసర్లు ప్రగతిభవన్ నుంచి ఫోన్లు రాగానే ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకున్నారని టాక్. రూలింగ్ పార్టీ ఆందోళనలు, ధర్నాలు చేసినప్పుడు అందుకు దగ్గరుండి ఏర్పాట్లు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలన్ని గ్రహించిన కేంద్ర ఎన్నికల టీమ్ సదరు అధికారులను బదిలీ చేసిందనే ప్రచారం జరుగుతున్నది.

త్వరలో మరికొందరిపైనా..

ప్రస్తుతం బదిలీ చేసిన ఆఫీసర్ల స్థానంలో కొత్త వారిని సెలక్ట్ చేసిన తర్వాత మరి కొందరు ఆఫీసర్లపైనా ఈసీ వేటు వేసే అవకాశాలు ఉన్నట్టు టాక్. రెండో జాబితాలో కొందరు ఉన్నత స్థాయి అధికారులు ఉంటారని అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది. దీంతో అటు ఐఏఎస్, ఇటు ఐపీఎస్‌లు ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed