HYD: పోలీసుల ఓవరాక్షన్.. గాంధీభవన్‌ నుంచి దౌర్జన్యంగా ఆ రెండు తరలింపు!

by Disha Web Desk 2 |
HYD: పోలీసుల ఓవరాక్షన్.. గాంధీభవన్‌ నుంచి దౌర్జన్యంగా ఆ రెండు తరలింపు!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న పరిస్థితుల్లో పోలీసులు గాంధీభవన్​నుంచి కాంగ్రెస్​ప్రచార వాహనాలను దౌర్జన్యంగా తీసుకెళ్లటం తీవ్ర వివాదాస్పదమైంది. ఇటీవల బీఆర్ఎస్​నుంచి దుబ్బాక స్థానానికి పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్​రెడ్డిపై దాడి జరిగిన తరువాత కేవలం బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులకు భద్రత పెంచుతూ ఇంటెలిజెన్స్ అదనపు డీజీ జారీ చేసిన సర్క్యూలర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్​పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ ప్రత్యేకంగా ఓ ఏటీఎం మిషన్‌ను తయారు చేయించింది.

ఈ ఏటీఎం మిషన్లో కార్డు పెడితే కేసీఆర్​నోట్లో నుంచి కరెన్సీ నోట్లు వస్తున్నట్టుగా కాంగ్రెస్​నాయకులు దానిని తయారు చేయించారు. దాంతోపాటు బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో స్కాములు జరిగాయంటూ ఓ అంబాసిడర్​కారును కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ కారుకు పూర్తిగా గులాబీ రంగు వేయించి 111 జీవో, ధరణి, బొగ్గు కుంభకోణం తదితర వాటిని దానిపై ప్రింట్​చేయించారు. వీటిని ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారు. శనివారం ప్రచారం ముగిసిన తరువాత ఈ కారు, ఏటీఎం మిషన్​ను గాంధీ భవన్​ఆవరణలో పెట్టారు. సిబ్బంది అందరూ వెళ్లిపోయిన తరువాత ట్రాఫిక్​టోయింగ్​వ్యాన్​తో అక్కడకు వచ్చిన పోలీసులు దౌర్జన్యంగా కారుతోపాటు ఏటీఎం మిషన్‌ను అక్కడి నుంచి తరలించారు.

వీటిని ప్రస్తుతం గోషామహల్​పోలీస్​స్టేడియంలో పెట్టారు. వీటిని తరలిస్తున్నపుడు అడ్డుకోవటానికి ప్రయత్నించిన కాంగ్రెస్​కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి తరిమేశారు. గాంధీ భవన్​ఆవరణలోకి చొరబడి దౌర్జన్యంగా కారు, ఏటీఎం మిషన్​ను పోలీసులు తీసుకెళ్లటాన్ని కాంగ్రెస్​నాయకుడు చామల కిరణ్​కుమార్​రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులు బీఆర్ఎస్​పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్వాధీనం చేసుకున్న కారు, ఏటీఎం మిషన్లను వెంటనే గాంధీ భవన్​కు తీసుకొచ్చి అప్పగించాలని డిమాండ్​చేశారు. లేనిపక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed