కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీపై సీఎం కేసీఆర్ రియాక్షన్

by Disha Web Desk 2 |
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీపై సీఎం కేసీఆర్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. గురువారం కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘డబ్బుల సంచులతో నగ్నంగా నడిరోడ్డుమీద దొరికిన ఒక దొంగ నా మీద కామారెడ్డిలో పోటీ చేస్తాడట. ఓట్ల కోసం ఎవడెవడో వచ్చి అనేక ప్రలోభాలు పెట్టాలని చూస్తాడు. అలాంటి ప్రలోభాలకు లొంగొద్దు’ అని కామారెడ్డి ప్రజలకు పిలపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే అని వ్యాఖ్యానించారు. రైతులకు, భూ యజమానుల కష్టాలు తీర్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని చెబుతన్నారని విమర్శించారు. ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేంది? ఢిల్లీకి చెందిన కాంగ్రెస్‌ , బీజేపీ నాయకులు, ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్‌ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గల్లీలను చుట్టుముట్టినట్లు అనేక వార్తలు ప్రజలలో బలంగా వినిపిస్తున్నాయి.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు పట్టుబడుతుండడంతో ఈ వార్తలను ప్రజలు విశ్వసించే పరిస్థితి ఏర్పడింది. దయచేసి చేసిన అభివృద్ధిని, బాగుపడిన బతులకులను చూడండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు గురికావొద్దని కేసీఆర్ అన్నారు. అంతేకాదు.. ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించి తాము లబ్ధి పొందాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజలకు ఇస్తున్న హామీలు ఇస్తున్నాయి. ఆ పార్టీలు గతానికి భిన్నంగా కేటాయిస్తున్న సీట్లు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీల ఓట్లను పొందేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బీసీలకు టికెట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా విఫలమయ్యింది. టికెట్ల కేటాయింపు విషయంలో బీసీలకు ఇచ్చిన మాటను విస్మరించడం కాంగ్రెస్‌ పార్టీకి కొత్తేమీ కాదు. దయచేసి మరోసారి బీఆర్ఎస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.

Next Story