దళిత బంధుపై మాట మార్చిన కేసీఆర్.. ఎన్నికల నేపథ్యంలో సరికొత్త వ్యూహం!

by Disha Web Desk 2 |
దళిత బంధుపై మాట మార్చిన కేసీఆర్.. ఎన్నికల నేపథ్యంలో సరికొత్త వ్యూహం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రిజర్వుడు స్థానాల్లో పట్టు కోసం బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒకవైపు అభివృద్ధి మంత్రం.. మరోవైపు దళితబంధు, సంక్షేమ పథకాల మంత్రాన్ని ప్రయోగిస్తున్నది. ఇప్పటివరకు వందమందికే ఇస్తున్న ఈ పథకాన్ని నియోజకవర్గంలోని దళితులందరికీ ఇస్తామంటున్నారు. దళితులంతా ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉండటంతో అడ్డుకట్ట వేసేందుకే ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తున్నది. ఒక్కసారిగా కేసీఆర్ మాటమార్చి అందరికీ వర్తింపజేస్తామని ప్రకటనలు చేస్తుండటం చర్చనీయాంశమైంది.

కేసీఆర్ కొత్త హామీ..

రెండో విడుత నియోజకవర్గానికి 1100 మందికి అందజేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినా ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. పథకాన్ని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు సేకరించి సెలక్ట్ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ వారికి రుణం మంజూరు కాకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో వారిని పార్టీ వైపు మళ్లించేందుకు కేసీఆర్ కొత్త హామీకి తెరతీశారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గం మాదిరిగా ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. దళితులంతా కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, తమను గెలిపిస్తేనే లాభం జరుగుతుందని ప్రకటనలు చేస్తున్నారు. మధిర, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో జరిగిన సభల్లోనూ కేసీఆర్ బీఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజకవర్గాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎన్నికలప్పుడే గుర్తొస్తామా అంటూ ఆ వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దళితులు సైతం కేసీఆర్ వ్యాఖ్యలను విశ్వసించడం లేదని పలువురు దళిత నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు...

19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలు ఉండగా మధిర, ములుగు, భద్రాచలం మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అయితే వీటిని తీరిగి కైవసం చేసుకునేందుకు కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. మధిర, ములుగు, భద్రాచలంలో పాగా కోసం స్పెషల్ నిధుల పేరుతో హామీలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నియోజకవర్గాల్లో ఏ మేరకు చేరాయనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నియోజకవర్గాల వార్ రూంల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో పాగా వేయాలని నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.

Next Story