వైఎస్ షర్మిల అరెస్ట్.. ఐపీసీ 353, 330 సెక్షన్ల ప్రకారం కేసులు

by Disha Web Desk 12 |
వైఎస్ షర్మిల అరెస్ట్.. ఐపీసీ 353, 330 సెక్షన్ల ప్రకారం కేసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిలను సోమవారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు షర్మిల లోటస్ పాండ్‌లోని తన ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. షర్మిల సచివాలయాన్ని ముట్టడించే అవకాశాలు ఉన్నట్లు అందిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పోలీసులు ఆమెను ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. అయితే, పోలీసులను తీసుకుని బయటకు వచ్చిన ఆమె రోడ్డుపై బైఠాయించారు. సొంత పనుల మీద కూడా బయటకు వెళ్లొద్దా అంటూ పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు.

ఈ క్రమంలో ఓ ఎస్సై‌తో పాటు మహిళా కానిస్టేబుల్ ను తోసివేశారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పై బలంగా కొట్టారు. అడ్డుకోబోయిన ఎస్సై రవీందర్‌ను నెట్టివేశారు. ఓ దశలో పోలీసుల పై నుంచి కారు తీసుకెళ్లమని డ్రైవర్ కు చెప్పడం గమనార్హం. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సై రవీందర్ తో పాటు మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన నేపథ్యంలో ఐపీసీ 353, 330 సెక్షన్‌ల ప్రకారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇక, షర్మిల మాట్లాడుతూ పేపర్ లీకేజీ పై వినతిపత్రం ఇవ్వడానికి వెళుతుంటే అడ్డుకున్నారని చెప్పారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వైఎస్ విజయలక్ష్మి

షర్మిల అరెస్ట్ గురించి తెలియగానే ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. షర్మిలను కలవడానికి అనుమతించకపోవడంతో ఆమె పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ క్రమంలో విజయమ్మ కూడా మహిళా కానిస్టేబుల్ పై చెయ్యి చేసుకోవడం గమనార్హం. మీడియాతో మాట్లాడుతూ షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పడం లేదన్నారు. షర్మిల ఏమైనా టెర్రరిస్టా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. పోలీసులకు తెలిసింది షర్మిలను, ఆమె డ్రైవర్లను కొట్టడమే అని విమర్శించారు. కాగా, పార్టీ కార్యకర్తలు కొందరు పోలీస్ స్టేషన్ వద్దకు రాగా పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Read more:

పోలీసులపై చేయి చేసుకున్న YS షర్మిల.. కేసు నమోదు (వీడియో)

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు YS విజయలక్ష్మి.. పోలీసులపై సీరియస్

Next Story