Telangana Rains: ఇంకా కోలుకోలేదు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

by Disha Web Desk 2 |
Telangana Rains:  ఇంకా కోలుకోలేదు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్టం పలు ప్రాంతాల్లో వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఏపీ పరిసరాల్లో కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వెల్లడించారు.

తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేశారు. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


Next Story