'అవిశ్వాస తీర్మాణం' అసలు కథేంటి..!

by Disha Web Desk 20 |
అవిశ్వాస తీర్మాణం అసలు కథేంటి..!
X

దిశ, కొత్తగూడ : కొత్తగూడ మండలంలోని పొగుళ్ళపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంఘటన కొత్తగూడ మండలంలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇక్కడ చైర్మన్ గా పని చేసిన ఎవరి పై అవిశ్వాస తీర్మానం పెట్టకపోవడం, అతని రెండు పదవులకు గండం వాటిల్లే అవకాశం ఉండటంతో మండల వ్యాప్తంగా ఈ ఘటన పై చర్చ జరుగుతున్నది.

అవిశ్వాసంపై జోరుగా చర్చ...

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలోని రైతు సహకార సంఘం ఛైర్మన్ దేశిడి శ్రీనివాస్ రెడ్డి పదవి పై అసమ్మతి ఎదురయ్యింది. ఛైర్మన్ గా బాధ్యతలు పొంది మూడు సంవత్సరాలు దాటినా నేటికీ ఎటువంటి సమావేశాలు, సభలు నిర్వహించకుండా ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్నాడని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. రైతులకు కావలసిన ఎరువులు, పండించిన పంట ధాన్యాలను విక్రయించేందుకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా కోనుగోలు కేంద్రాలను అందుబాటులో నిర్వహించాల్సి ఉంది. కాగా ఈ కొనుగోలు కేంద్రాల నిర్వహణలో చైర్మెన్ దేశిడి శ్రీనివాస్ రెడ్డి సొంత నిర్ణయాలతో ఏక చత్రాధిపత్యంగా వ్యవహరించేవాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ డైరెక్టర్ లతో పాటు సొంత పార్టీ డైరెక్టర్లలో సైతం అసమ్మతి పెరిగిపోయింది.

ఏడాదికి ఓసారి..అది కూడా లేదు..?

ప్రతి ఏడాదికి ఓసారి నిర్వహించాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశం గత మూడేళ్ళుగా నిర్వహించడం లేదు. ఏడాదిలో జరిగిన లావాదేవీలు, సంఘం అభివృద్ధికై సంవత్సరం చివర్లో నిర్వహించాల్సిన సమావేశం ఏర్పాటు చేయక పోవడంతో డైరెక్టర్ లు అసహనానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా... సంఘం అభివృద్ధి లావాదేవీలకు సంబంధించి ఎవరన్నా వివరణ కోరగా 'అంతా నీకు చెప్పాలా' అంటూ దురుసుగా వ్యవహరిస్తుండటం వల్ల ప్రతి పక్ష డైరెక్టర్లలోనే కాకుండా సొంత పార్టీ డైరెక్టర్లలో సైతం వ్యతిరేకత పెరిగింది.

రూ. 10లక్షలు స్వాహా..!

సంఘం నిధుల లెక్కలు మండలికి చూపించకుండా ఇష్టం వచ్చిన లెక్కలు రాసినట్లు డైరెక్టర్లు ఆరోపించారు. సంఘ అభివృద్ధికై వచ్చిన నిధులను పూర్తి స్ధాయిలో వెచ్చించకుండా నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. గోడౌన్ భవన నిర్మాణానికి వచ్చిన నిధులు రూ.49లక్షలు. వీటిలో భవన నిర్మాణానికి పూర్తి స్ధాయిలో వెచ్చించకుండా రూ.10లక్షలు స్వాహా చేసినట్లు డైరెక్టర్లు బాహాటంగా ఆరోపించడం గమనార్హం.

మొదలైన బుజ్జగింపుల ధోరణి..!

పొగుళ్ళపల్లి పీఏసీఎస్ లో మొత్తం 13మంది డైరెక్టర్లు ఉన్నారు. అందులో 9మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ సొంత పార్టీకి చెందిన వారు కాగా 4గురు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు. వీరందరూ చైర్మన్ దేశిడి శ్రీనివాస్ రెడ్డి పై అవిశ్వాసం ప్రకటిస్తూ డీసీఓ కుర్షిత్ కి వినతిపత్రం అందించిన సంగతి తెలిసిందే. కాగా అధికారుల ముందు తనకు మెజారిటీ ఉందని నిరూపించుకోలేని పరిస్థితిలో రెండు పదవులనూ కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా డైరెక్టర్లను బుజ్జగింపులకు గురిచేస్తూ ఆఫర్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కావాలని దుష్పచారం చెస్తున్నారు- దేశిడి శ్రీనివాస్ ఒడిసిఎంఎస్ వైస్ చెర్మన్

పొగుళ్ళపల్లి పీఏసీఎస్ చైర్మెన్ పదవి పొందిన నాటి నుండి ఇప్పటి వరకు నిస్వార్ధంగా సంఘం అభివృద్ధికి పాటుపడుతున్నాను. రైతులకు అందుబాటులో ఉంటూ, సంఘం అభివృద్ధికి పాటుపడుతున్నాను. గత 60సంవత్సరాలలో చేయని అభివృద్ధిని మూడు సంవత్సరాలలో చేసి చూపించాను. రైతులకు ఎరువులు, పంటల కోనుగోలు విషయంలో ఎక్కడ చిన్న సమస్య లేకుండా చూసుకున్నాను దీనిని చూసి జీర్ణించుకోలేక కావాలని నామీద దుష్పచారం చెస్తున్నారు. అక్రమాలకు పాల్పడితే దేనికైనా సిద్ధం అంటు చైర్మెన్ చెప్పుకొచ్చారు.

పోగుళ్లపల్లి పీఎసీఎస్ పై విచారణ చేయాలి: తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి రాజు

పొగుళ్లపల్లి రైతు సహకార సంఘం అవినీతికి అడ్డాగా మారడం దారుణమని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘానికి వచ్చే ఎరువులను రైతులకు సరిగా ఇవ్వలేదన్నారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ తరలించేవాడన్నారు. విజిలెన్స్ అధికారుల చేత విచారణ చేపట్టి భాద్యుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed