బండి సంజయ్‌ని A1గా చేర్చడానికి కారణమిదే : సీపీ రంగ‌నాథ్‌

by Disha Web Desk 12 |
బండి సంజయ్‌ని A1గా చేర్చడానికి కారణమిదే : సీపీ రంగ‌నాథ్‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ప‌దో త‌ర‌గ‌తి హిందీ పేప‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజ‌య్ కుట్ర ఉంద‌ని, ఈ మొత్తం వ్యవ‌హారంలో ఆయ‌న పాత్రే కీల‌కంగా ఉంద‌ని పేర్కొంటూ రిమాండ్ రిపోర్టులో ఏ- 1 గా వ‌రంగ‌ల్ పోలీసులు పేర్కొన్నారు.టెన్త్ హిందీ ప్రశ్నాప‌త్రం లీక్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టులో ఏ- 1 గా బండి సంజయ్ ని చేర్చారు.

ఏ2గా బూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5 మోతం శివగణేశ్, ఏ6 పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్ , ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా వసంత్‌ను పేర్కొన్నారు. బూరం ప్రశాంత్ చైన్ లింక్ ద్వారా వైరల్ చేశారని అన్నారు.. 120బీ, 420,447,505(1)(b) ఐపీసీ సెక్షన్ (4) సెక్షన్లలో కేసులు నమోదు చేశామ‌న్నారు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను వ‌రంగ‌ల్ సీపీ ఏవీ రంగ‌నాథ్ బుధ‌వారం సాయంత్రం క‌మిష‌న‌రేట్‌లోని క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాట చేసిన విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు.

బండి, ప్రశాంత్‌ల మ‌ధ్య వాట్సాప్ చాటింగ్‌..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్, ఫ్రీలాన్స్ జ‌ర్నలిస్ట్ ప్రశాంత్‌ల మ‌ధ్య త‌రుచూ వాట్సాప్ చాటింగ్, కాల్స్ చేసుకోవ‌డం జ‌రుగుతున్నట్లుగా గుర్తించిన‌ట్లు తెలిపారు. తెలుగు పేప‌ర్ లీకైన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తూ బండి సంజ‌య్‌కు ఒక పోస్టును ప్రశాంత్ పంపాడ‌ని, అదే రోజూ ప్రశాంత్ పంపిన పోస్టులోని విష‌యాల‌నే ప్రెస్‌మీట్‌లో మాట్లాడ‌టం జ‌రిగింద‌ని అన్నారు. అలాగే హిందీ పేప‌ర్ బ‌య‌ట‌కు రావ‌డానికి ముందు రోజూ కూడా బండి సంజ‌య్‌తో ప్రశాంత్ వాట్సాప్‌లో మాట్లాడిన‌ట్లు గుర్తించిన‌ట్లు తెలిపారు.

పేప‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ప్రశాంత్ బండి సంజ‌య్‌కు పోస్టు చేయ‌డం, వాట్సాప్ కాల్ మాట్లాడ‌టం జ‌రిగింద‌న్నారు. అయితే మిగ‌తా బీజేపీ నేత‌ల‌కు కూడా ప్రశాంత్ హిందీ ప్రశ్నాప‌త్రాన్ని ఫార్వర్డ్ చేసినా బండి సంజ‌య్‌కు ప్రశాంత్‌కు మ‌ధ్య త‌రుచూ చాటింగ్ అనుమానాస్పదంగా ఉంద‌ని అన్నారు. ఎంపీ బండి సంజయ్‌ను ఫోన్ ఇవ్వాల‌ని తాము కోరినా, లేద‌ని చెబుతున్నట్లుగా వ‌రంగ‌ల్ సీపీ తెలిపారు. ఆయ‌న ఫోనిస్తే మ‌రిన్ని లింకులు బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అయితే టెక్నీకల్ ఏవిడెన్స్ సేకరిస్తున్నామ‌ని తెలిపారు.

అలా అరెస్ట్ చేయవచ్చు..!

బండి సంజయ్ ని కరీంనగర్‌లో ప్రైవేంటివ్ అరెస్టు చేశారు. కేసు మా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడికి తీసుకు వచ్చామ‌న్నారు. వారెంట్ - నోటీస్ లేకుండా కూడా అరెస్ట్ చేయవచ్చని సెక్షన్ 41సీఆర్‌పీసీ చెబుతోంద‌ని స్పష్టం చేశారు. పార్లమెంట్ స్పీకర్ కు కూడా బండి సంజయ్ అరెస్టు పై సమాచారం ఇచ్చామ‌న్నారు. ఈకేసును పక్కా లీగల్ ప్రాసెస్ లో, పార‌ద‌ర్శకంగా ద‌ర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మా పై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు, ఇబ్బంది పెట్టేందుకు బండి సంజ‌య్ ప్రయ‌త్నం చేస్తున్నట్లుగా తాము గ్రహించ‌డం జ‌రిగింద‌న్నారు. పోలీసులు సాయంత్రం 4:14 నిముషాల‌కు హ‌న్మకొండ కోర్టుకు తీసుకువ‌చ్చారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కాసేపట్లో కేసుపై విచారించనున్న కోర్టు సంజయ్ కు బెయిల్ ఇస్తుందా ? రిమాండ్ విధిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.


Next Story