- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణలో చిక్కులు.. స్పందన శూన్యం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించింది. ఎల్-1 టీంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి ఉండగా, ఎల్-2లో టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఎల్-3 జిల్లా యంత్రాంగస్థాయిలో బృందాలను ఏర్పాటుచేశారు.

దిశ, వరంగల్ బ్యూరో : అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల క్లియరెన్సు నత్తనడకన సాగుతోంది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీంపై ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ దరఖాస్తులన్నిటినీ క్లియర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించినా.. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు ప్రొగ్రాం ఫెయిల్యూర్‌కు దారితీస్తోంది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌తో పాటు తొమ్మిది మునిసిపాలిటీలైన మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, పరకాల, భూపాలపల్లి, జనగామ కార్యాలయాలకు మొత్తం ఒక లక్షా 60వేల పైచిలుకు దరఖాస్తులందాయి. ఇప్పటి వరకు 30వేల పైచిలుకుగా దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 7వేల దరఖాస్తులను తిరస్కరించారు. 13వేల పైచిలుకు దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్లుగా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇదీ ప్రక్రియ..!
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించింది. ఎల్-1 టీంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి ఉండగా, ఎల్-2లో టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఎల్-3 జిల్లా యంత్రాంగస్థాయిలో బృందాలను ఏర్పాటుచేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందాలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఆయా దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. లేఅవుట్‌లు చెరువుల్లో, వక్ఫ్‌బోర్డు, దేవాదాయ, చెరువులు, కుంటల్లో ఉన్న పక్షంలో రెగ్యులరైజ్ చేయకుండా తిరస్కరిస్తున్నారు. అన్ని సక్రమంగా ఉన్నట్లయితే తహసీల్దార్లు పరిశీలించి, ఆయా దరఖాస్తులదారులకు సంబంధించిన రెగ్యులరైజ్ ఫీజును నిర్ణయిస్తారు. దరఖాస్తుదారులు నిర్ణీత ఫీజు చెల్లిస్తే స్థానిక సంస్థల అధికారులు, డీపీవో, అదనపు కలెక్టర్ పరిశీలిస్తారు. అంతిమంగా కలెక్టర్‌స్థాయిలో పరిశీలించి, లోపాలు ఉంటే తిరస్కరిస్తారు. అన్ని సక్రమంగా ఉంటే రెగ్యులరైజ్ చేస్తారు. ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం దాదాపు.. వేలకు పైగా దరఖాస్తులను పరిశీలించింది. వీటిలో కొన్నింటిని రెగ్యులరైజ్ కూడా చేశారు.
స్పందన అంతంతే..!
అక్రమంగా వెలిసిన లేఅవుట్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి నోటీసులు జారీచేయడం అధికారులకు సవాల్‌గా మారింది. దరఖాస్తుదారులకు ఫోన్‌ల ద్వారా సమాచారం అందించినప్పటికీ చాలా మంది స్పందించడంలేదు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్లాట్లు చూపించాలని కోరితే.. యజమానుల నుంచి స్పందన లభించడంలేదు. జిల్లాలోని గ్రామపంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లలో కొనుగోలుచేసిన ప్లాట్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ కోసం పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ప్లాట్ల ధరలు గణనీయంగా పడిపోవడంతో ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లలో ఎల్‌ఆర్‌ఎస్‌కోసం దరఖాస్తు చేసుకున్నవారి నుంచి స్పందన కరువైంది. మునిసిపాలిటీల పరిధిలోని దరఖాస్తులుదారులు మాత్రమే రెగ్యులరైజ్ చేసుకునేందు కు ముందుకొస్తున్నారు.
వెంటాడుతున్న సమస్యలు..!
25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు గడువు పెంచిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి, చేసుకోవాలనుకునే వారికి అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం చెందుతున్నారు. రుసుము చెల్లించాలనుకుంటున్న వారికి టెక్నికల్ సమస్యలు ఎదురవుతుండటం గమనార్హం. అప్లికేషన్ చేసినప్పటి వివరాలకు ఆన్‌లైన్‌లో జనరేట్అయిన వివరాలకు పొంతన ఉండటం లేదు. సరి చేసుకుందామంటే సర్వర్ బిజీ సమస్యలు ఎదురువుతున్నాయి. ఎల్ఆర్ఎస్ కోసం మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లు యాక్టివ్‌గా లేకపోవడం కూడా శాపంగా మారింది. 2020కి ముందు అప్లికేషన్ పెట్టుకున్న వారి వివరాలేవీ ఆన్లైన్‌లో కనిపించకపోవడంతో గందరగోళం నెలకొంది.






