నువ్వా.. నేనా ? ..జ‌న‌గామ కాంగ్రెస్‌లో ఆధిప‌త్య పోరు

by Dishanational2 |
నువ్వా.. నేనా ? ..జ‌న‌గామ కాంగ్రెస్‌లో ఆధిప‌త్య పోరు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్‌లో ఆధిప‌త్య పోరు తార‌స్థాయికి చేరుకుంది. పొన్నాల వ‌ర్సెస్ కొమ్మూరి వ‌ర్గాల మ‌ధ్య పార్టీలో ప్రచ్చన్నయుద్ధం జ‌రుగుతోంది. గ‌త కొంత‌కాలంగా నియోజ‌క‌వ‌ర్గంలో భార‌త్ జోడోయాత్ర‌, ఆత్మీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కొమ్మూరి సొంతంగా క్యాడ‌ర్‌ను పెంపొందించుకుంటున్నారు. ఈసారి జ‌న‌గామ టికెట్ సైతం ఆయ‌న‌కే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ మెజార్టీ కాంగ్రెస్ నాయ‌కుల్లో నెల‌కొని ఉంది. డీసీసీ రేసులో సైతం ఆయ‌న పేరు వినిపించ‌డం గ‌మ‌నార్హం. దీంతో స‌హ‌జంగానే కొమ్మూరి వైపు క్యాడ‌ర్ వెళ్తోంద‌న్న అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో వ్యక్తమ‌వుతోంది. ఈ ప‌రిస్థితిపై ఆందోళ‌న చెందుతున్న పొన్నాల వ‌ర్గం కొమ్మూరిని క‌ట్టడి చేసేందుకు ప్రయ‌త్నాలు మొదలు పెట్టిన‌ట్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాలను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

స్పీడ్ పెంచిన కొమ్మూరి..!

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి 2018 ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి జ‌న‌గామ‌లో పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గానికి రెండు ద‌ఫాలుగా ఎమ్మెల్యేగా ప‌నిచేసిన రాజ‌కీయ అనుభ‌వంతో కాంగ్రెస్‌ను గాడిలో పెట్టే ప్రయ‌త్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి ఆల‌యం నుంచి ప్రారంభించిన‌ హాథ్​సే హాథ్​భార‌త్ జోడో పాదయాత్రకు ప్రజ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ యాత్ర త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స్పీడ్ పెంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకత ఉంద‌న్నచ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి కొమ్మూరి బ‌రిలో ఉంటే ఆయ‌న‌కు అనుకూల ఫ‌లితాలు ఉంటాయ‌న్న విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. అయితే మ‌రోవైపు కొమ్మూరి ప‌ర్యట‌న‌ల‌ను మాత్రం పొన్నాల వ‌ర్గం త‌ప్పుబ‌డుతోంది. మ‌ళ్లీ పొన్నాల‌నే జ‌న‌గామ బ‌రిలో ఉంటార‌ని కూడా చెప్పుకొస్తున్నారు. ఆయ‌న్ను కాద‌ని కొమ్మూరికి టికెట్ ఇచ్చే అవ‌కాశ‌మే లేద‌ని కూడా బ‌లంగా వాదిస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే ఇద్దరు సీనియ‌ర్ నేత‌ల అనుచ‌రుల మ‌ధ్య కొద్దిరోజులుగా మాట‌ల యుద్ధం న‌డుస్తోంది.

స‌స్పెన్షన్ల వ్యవ‌హారంతో రాజ‌కీయ వే‘ఢీ’..!

కాంగ్రెస్‌ లీడర్‌‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాసంపల్లి లింగాజీ గురువారం విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి ప్రక‌టించ‌డం గ‌మనార్హం. గురువారం మధ్యాహ్నం కళ్లెం రోడ్డులోని పార్టీ ఆఫీస్‌లో టీపీసీసీ మెంబర్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌తో కలిసి ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధిష్టానం ఎన్నోమార్లు హెచ్చరించినా ఆయన ప్రవర్తన మార్చుకోవడంలేదని ఆరోపించారు. అందుకే పార్టీ ప్రాథ‌మిక స‌భ్యత్వాన్ని ర‌ద్దు చేయ‌డంతో పాటు పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లుగా ప్రక‌టించారు. అయితే తనను సస్పెండ్‌ చేసే అధికారం ఎవరికీ లేదని, మతిస్థిమితం కోల్పోయి పిచ్చి ప్రకటనలు చేస్తున్న మాసంపల్లి లింగాజీ, మరికొందరు లీడర్లు ముందు ఎర్రగడ్డకు వెళ్లి చూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి ఘటుగా విమర్శించారు. పార్టీని, ప్రజలను మోసం చేసి ఎన్నో పదవులను అనుభవించిన లీడర్లు ఇంకా రాజకీయాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ పొన్నాల‌ను ఉద్దేశించి ఆరోపించారు. జిల్లాలోని అన్ని కమిటీలు రద్దైన త‌ర్వాత స్వార్థ రాజకీయాల కోసం లేని హోదాలను ఉన్నట్లు చెప్పుకుంటూ సిగ్గుచేట‌ని మండిప‌డ్డారు.

జ‌న‌గామ‌పై రేవంత్‌రెడ్డి ఫోక‌స్‌..

జ‌న‌గామ కాంగ్రెస్‌లో నెల‌కొన్న తాజా ప‌రిస్థితుల‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరా తీసిన‌ట్లు స‌మాచారం. మ‌రో ఆరు నెల‌ల్లోనే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ పార్టీలు భావిస్తున్న త‌రుణంలో జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గపై రేవంత్ రెడ్డి ఫోక‌స్ పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. కొమ్మూరి స్పీడ్ వెనుక రేవంత్ రెడ్డి మార్గద‌ర్శనం ఉంద‌న్న అభిప్రాయాన్ని కొంత‌మంది లీడ‌ర్లు వ్యక్తం చేస్తుండటం గ‌మ‌నార్హం. ఇద్దరు సీనియ‌ర్ నేత‌ల్లో అధిష్ఠానం ఎవ‌రి వైపు నిలుస్తుంది..? ఎవ‌రిని క‌ట్టడి చేస్తుంది..? ఎవ‌రిని ప్రోత్సహిస్తుంద‌న్న విష‌యం తేలాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.



Next Story