రేపటి నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర

by Disha Web |
రేపటి నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర
X

దిశ, ములుగు ప్రతినిధి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన హత్ సే హాత్ పాదయాత్ర ములుగు నియోజకవర్గంలోని సమ్మక్క -సారలమ్మ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయం వద్ద నుండి రేపు ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు ములుగు జిల్లాలో కొనసాగనున్న పాదయాత్రలో మొదటి రోజు ఉదయం ములుగు గట్టమ్మ వద్ద గట్టమ్మ దేవాలయంలో పూజల అనంతరం సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామానికి చేరుకొని ఉదయం సమ్మక్క- సారలమ్మ వన దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. కొంతసేపు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం మధ్యాహ్నం కొత్తూరు, నార్లపూర్ గ్రామాల మీదుగా ప్రాజెక్ట్ నగర్ గ్రామానికి చేరుకొని మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ప్రాజెక్టు నగర్ నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించి పస్రా గ్రామానికి చేరుకోనున్నారు. సాయంత్రం పస్రా గ్రామం జంక్షన్ లో కార్నర్ మీటింగ్లో ప్రసంగించిన అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమై గోవిందరావుపేట, చల్వాయి, మాచ్ఛపూర్, జవహర్ నగర్, జంగాలపల్లి క్రాస్ రోడ్ మీదుగా ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్ రోడ్ నుండి పాలంపేట గ్రామానికి చేరుకోనున్నారు. పాలంపేట గ్రామంలో రాత్రి బస చేసిన అనంతరం మరుసటి రోజు మంగళవారం తిరిగి యాత్ర ప్రారంభం కానుంది.

కాంగ్రెస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు

పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు. ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి దానసరి సీతక్క నియోజకవర్గం కావడంతో పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు. ములుగు జాతీయ రహదారి 163 పై భారీ కటౌట్లను ఏర్పాటు చేసి, పాదయాత్రకు పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులను తరలించే ఏర్పాటులో నిమగ్నమయ్యారు. రేవంత్ రెడ్డి బసచేసే గ్రామాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ములుగు నుండి ప్రారంభం కానుండటంతో ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అన్ని వర్గాలు పాల్గొనాలి : ములుగు ఎమ్మెల్యే సీతక్క

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడోయాత్ర కొనసాగింపుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మేడారంలోని సమ్మక్క -సారలమ్మల పోరాట ప్రతిమను పునికి పుచ్చుకొని బానిస సంకెళ్లు తెంచుకోవటానికి వారు చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి మేడారం వనదేవతల సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభం కానుందని పేర్కొన్నారు. పాదయాత్రకి జిల్లా ప్రజలు భారీ ఎత్తున హాజరై రేవంత్ రెడ్డి వెంట యాత్రలో పాల్గొని మన రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలన కి చరమ గీతం పాడాలని, మద్దతు ఇవ్వాలి అని సీతక్క అన్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నేపథ్యంలో ములుగు జిల్లాలోని నాయకులు, అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రకు హాజరై మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు బలరాం నాయక్, తాటికొండ రాజయ్య, భూపాల్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు, సీనియర్ నాయకులు మల్లు రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story