పంచాయతీ కార్యాలయానికి తాళం.. పోలీస్ స్టేషన్ కు పంచాయతీ

by Disha Web Desk 4 |
పంచాయతీ కార్యాలయానికి తాళం.. పోలీస్ స్టేషన్ కు పంచాయతీ
X

దిశ, జనగామ: జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కళ్లెం గ్రామంలో పంచాయతీ కార్యాలయానికి ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు తాళం వేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉపాధి హామీ పథకం కింద గ్రామపంచాయతీ నూతన భవనానికి రూ. 1300, 000 ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా సంబంధిత అధికారులు భవన నిర్మాణం కోసం పనులు ప్రారంభించి కొంతమేరకు పనులు చేశారు. ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న పనులు చేయాల్సి ఉండగా.. నిర్లక్ష్యంగా వదిలేశారు.

అయితే శిధిలావస్థలో ఉన్న పురాతన భవనంలో ఇబ్బందులు పడే బదులుగా నూతనంగా నిర్మించిన భవనంలోకి మారాలని ప్రస్తుత సర్పంచ్, వార్డు సభ్యులు తీర్మానం చేసి నూతనంగా నిర్మించిన భవనంలోకి ప్రవేశం చేయాలని అనుకున్నారు. అయితే తనకు డబ్బులు రావాల్సి ఉందని, తన బిల్లులు చెల్లించి ఇందులో ప్రవేశించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు.

దీంతో పాత భవనంలో నుండి నూతన తన భవనంలోకి మార్చాల్సిన సామాగ్రి అంతా రోజంతా రోడ్డుపై ట్రాక్టర్ లో ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. ఇది కాస్త చిలికి, చిలికి గాలివానగా మారి పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేశారు. ఈ విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు మాత్రం ఈ విషయంలో స్పందించక పోవడం బాధాకరం.


Next Story

Most Viewed