రాకాసి రాళ్లవానా.. రైతులకు కన్నీరే మిగిల్చింది

by Dishanational2 |
రాకాసి రాళ్లవానా.. రైతులకు కన్నీరే మిగిల్చింది
X

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్షం కురియడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జనగామ, ములుగు జిల్లాలో మోస్తరు వర్షం కురియగా వరంగల్, హన్మకొండ, మానుకోట, భూపాలపల్లి జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపించాడు. అకాల వర్షాలు అన్నదాతలను కోలుకోలేకుండా చేశాయి. వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చితోటలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రాళ్లవానకు పంటలు నామరూపం లేకుండా పోయాయి. ఒక్క రోజులోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అంచనా. పూరిగుడిసెలు కూలిపోగా, రేకుల ఇండ్లు రాళ్లదాడికి ధ్వంసమయ్యాయి. దుగ్గొండి మండ‌లం చాపలబండ గ్రామంలో వడగళ్ల వాన తాకిడికి తట్టుకోలేక పది గొర్రెలు వ్యవ‌సాయ బావిలో పడి మృతిచెందాయి. ప్రజాప్రతినిధులు కంటితుడుపుగా బాధిత రైతులను పరామర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారానికి సబంధించి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌డ‌గళ్ల వాన ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాను అతలాకుత‌లం చేసింది. శ‌నివారం రాత్రి మొద‌లైన వాన అర్ధరాత్రి వేళ బ‌ల‌మైన ఈదురు గాలులు, వ‌డ‌గళ్లతో విరుచుకుప‌డింది. వ‌రంగ‌ల్, హ‌న్మకొండ‌, మ‌హ‌బూబాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో వాన ప్రభావం ఎక్కువ‌గా ఉంది. ములుగు, జ‌నగామ జిల్లాల్లో ఓ మోస్తారు వ‌ర్షం కురిసింది. వడ‌గ‌ళ్లు ప‌డ‌డంతో వేలాది ఎక‌రాల్లోని వ‌రి, మిర‌ప‌, మామిడి, అర‌టి, మొక్కజొన్న, కాయ‌గూర‌ల పంట‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా న‌ర్సంపేట డివిజ‌న్‌లోని నెక్కొండ‌, ఖానాపురం, దుగ్గొండి, న‌ల్లబెల్లి, న‌ర్సంపేట మండ‌లాలు, హ‌న్మకొండ జిల్లాలోని ప‌ర‌కాల డివిజ‌న్‌లోని ఆత్మకూరు, న‌డికూడ‌, వ‌రంగ‌ల్ జిల్లాలోని సంగెం, గీసుగొండ‌, భూపాల‌ప‌ల్లి జిల్లాలోని రేగొండ‌, గ‌ణ‌పురం, కాటారం స‌బ్ డివిజ‌న్‌లోని కాటారం, మ‌హాముత్తారం, మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, కేస‌ముద్రం, మ‌హ‌బూబాద్‌, బ‌య్యారం, గార్ల, కొత్తగూడ మండ‌లాల్లో వ‌డ‌గ‌డ్ల వ‌ర్షం ప్రభావం కనిపించింది. పిందె ద‌శ నుంచి కాయ ముదిరే ద‌శ‌లో ఉన్న మామిడి పంట బ‌ల‌మైన గాలులతో నేలరాలిపోయింది. ఇక ఉద్యాన‌పంట‌లైన అర‌టి, బొప్పాయి, కాయ‌గూర‌లు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. సంప్రదాయ‌క పంట వ‌రి, మొక్కజొన్న పంట‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాణిజ్య పంట‌గా ఉన్న మిర‌ప తోట‌ల్లో కాయ‌లు నేల‌రాలిపోగా, క‌ల్లాల్లో ఆర‌బోసిన పంట త‌డిసి ముద్దయింది. ప‌లుచోట్ల ఇళ్ల పైక‌ప్పులు దెబ్బతిన్నాయి. రేకులు ధ్వంస‌మ‌య్యాయి. మిర్చి పత్తితోపాటు పండ్లతోటలకు అపార నష్టం వాటిల్లింది. వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వడగండ్ల తాకిడి తట్టుకోలేక బావిలో పడి గొర్రెలు మృతి..

వ‌రంగ‌ల్ జిల్లా దుగ్గొండి మండ‌లం చాపలబండ గ్రామంలో వడగళ్ల వాన తాకిడికి తట్టుకోలేక గొర్రెలు మందలో నుంచి పరుగెత్తుతూ వెళ్లి వ్యవ‌సాయ బావిలో పడి ప‌ది వ‌ర‌కు మృతిచెందాయి. మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌లం చిన్న ఎల్లాపూర్ గ్రామనికి చెందిన ధరంసోత్ శంకర్, జరుపల కిర్యా ఇద్దరు రైతులు శనివారం రాత్రి మొక్కజొన్న చేను కావలికి వెళ్లారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు సమీపంలోని ఓ గుడి వద్ద గుడిసెలో తల దాచుకొని ఉండగా చెట్టు కూలి వారిపై పడటంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కీర్యకు రెండు కాళ్లు విరిగాయి. తండావాసులు కీర్య ను ఆస్పత్రికి తరలించారు.

ఏదీ ప్రభుత్వం భ‌రోసా..

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాను వ‌డ‌గ‌ళ్ల వాన అతలాకుతలం చేయ‌గా, ప్రభుత్వం నుంచి క‌నీసం కంటి తుడుపు చ‌ర్యలు కూడా క‌నిపించ‌డం లేదు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో దెబ్బతిన్న పంట‌ల‌ను మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ప‌రిశీలించారు. అలాగే న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి ప‌ర్యటించారు. ఇక మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు నామ‌మాత్రంగా ప‌ర్యట‌న‌లు చేసి మ‌మ అనిపించారు. ఇక ప్రభుత్వం ప‌రంగా అధికారికంగా న‌ష్ట ప‌రిహారం అంచ‌నాకు సంబంధించిన ఎలాంటి ఆదేశాలు ఇప్పటి వ‌ర‌కు అందకపోవడం గ‌మ‌నార్హం. వ్యవ‌సాయ‌, ఉద్యాన‌శాఖ అధికారులు సైతం మొక్కుబ‌డిగా ఆయా మండ‌లాల్లో ప‌ర్యటించారు. అయితే న‌ష్టం ప‌రిహారం అంద‌జేసే ఉద్దేశం మాత్రం ప్రభుత్వానికి లేద‌న్న విష‌యం స్పష్టమ‌వుతోంది. వాస్తవానికి గ‌తంలో అకాల వ‌ర్షాలు న‌ర్సంపేట‌, ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో బీభ‌త్సం సృష్టించిన స‌మ‌యంలో మంత్రుల బృందం ప‌ర్యటించింది.

ఈబృందంలో వ్యవ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి, గంగులాక‌మ‌లాక‌ర్‌, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి స‌త్యవ‌తి రాథోడ్‌, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు సైతం ఉన్నారు. ప‌ర‌కాల డివిజ‌న్ న‌డికూడ‌లో మిర్చి పంట‌ల‌ను ప‌రిశీలించి స్వయంగా మంత్రులే దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. న‌ష్టం ప‌రిహారం అంద‌జేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పిస్తామ‌ని రైతుల‌కు మాటిచ్చిన మంత్రులు ఆ త‌ర్వాత పత్తా లేకుండాపోయారు. ఈ ప‌ర్యట‌న త‌ర్వాత మంత్రులు వ్యవ‌హ‌రించిన తీరుపై రైతాంగం నుంచి తీవ్ర విమ‌ర్శలు వ్యక్తమ‌య్యాయి. తాజాగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు రైతుల‌కు న‌ష్టప‌రిహారంపై హామీలిస్తున్నా గ‌త హామీలే నెర‌వేర్చలేద‌న్న విషయంపై విమ‌ర్శలు చేస్తున్నారు. అకాల వ‌ర్షం మిగిల్చిన న‌ష్టంపై ప్రభుత్వం నుంచి సాయం అంద‌డం గ‌గ‌న‌మేన‌న్న అభిప్రాయంతో రైతాంగం ఉండడం గ‌మ‌నార్హం.



Next Story

Most Viewed