ఏడాదిలో వందల కోట్లు.. ప్రయత్నాలు ముమ్మరం: మేయ‌ర్

by Disha Web |
ఏడాదిలో వందల కోట్లు.. ప్రయత్నాలు ముమ్మరం: మేయ‌ర్
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ఏడాది కాలంలో రూ.396 కోట్లతో జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టడం జ‌రిగింద‌ని మేయ‌ర్ గుండు సుధారాణి స్పష్టం చేశారు. మొత్తం 993 పనుల‌ను పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మార్గద‌ర్శకాలు, మంత్రి కేటీఆర్ విజ‌న్‌తో గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రగ‌తిబాట‌లో ప‌య‌నిస్తోంద‌ని అన్నారు. ఏడాది కాలంలోనే వంద‌లాది కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బ‌ల్దియా అభివృద్ధి ప‌నుల‌కు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. స్మార్ట్ సిటీగా మార్చేందుకు ముమ్మర ప్రయ‌త్నాలు సాగుతున్నాయ‌ని అన్నారు. ప్రజ‌ల‌కు మెరుగ‌న పౌర సేవ‌లందించేందుకు కార్పోరేట‌ర్ల కృషి చేయాల‌ని, అధికారులు స‌మ‌న్వయంతో ముందుకెళ్లాల‌ని సూచించారు. గురువారం గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ కౌన్సిల్ స‌మావేశం మేయ‌ర్ గుండు సుధారాణి అధ్యక్షత‌న జ‌రిగింది. 66 డివిజ‌న్ల కార్పోరేట‌ర్లు పాల్గొన్నారు.

396 కోట్లతో 993 అభివృద్ధి పనులు..

మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. జూన్ 3 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు పట్టణప్రగతిలో భాగంగా మొక్కలు నాటాల‌ని పిలుపినిచ్చారు. మహానగర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా గత మే నెల నుంచి నేటి వరకు ఏడాది కాలంలో మున్సిపల్ సాధారణ నిధి పట్టణ ప్రగతి, 15 వ ఆర్థిక సంఘం, స్మార్ట్ సిటీ నిధుల కింద 396 కోట్లతో 993 అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింద‌న్నారు. ఇందులో 47 కోట్లతో 523 పనులు పూర్తికాగా 277 కోట్లతో 172 పనులు పురోగతి దశలో ఉన్నాయ‌న్నారు. మిగిలిన 298 పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ ఎఫైర్స్ 2020 నవంబర్‌లో ప్రారంభించిన సర్ఫరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్‌లో దేశవ్యాప్తంగా పోటీల్లో పాల్గొన్న 63 నగరాల్లో వరంగల్ నగరానికి టాప్ 10 లో చోటు దక్కడం గర్వకారణం అని అన్నారు. మంత్రి కేటీఆర్‌ అదేశానుసారం స్మార్ట్ బస్ స్టేషన్లుగా నిర్మించుటకు డి.పి.ఆర్ సిద్ధం చేస్తున్నామ‌ని గుండు సుధారాణి వెల్లడించారు. అదేవిధంగా వరంగల్ మహా నగరం లో 24 గంట‌ల పాటు మంచి నీటి సరఫరా కోసం సుమారు 350 కోట్ల రూపాయల నిధులతో డి.పి.ఆర్ సిద్ధమైందన్నారు.

విలీన గ్రామాల స‌మ‌స్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే చ‌ల్లా


విలీన గ్రామాల్లో మంజూరైన శ్మశాన వాటిక‌ల నిర్మాణానికి వెంట‌నే టెండ‌ర్లను పిల‌వాల‌ని ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి సూచించారు. విలీన గ్రామాల్లో రోడ్ల విస్తరణ కనీసం 70 ఫీట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విలీన గ్రామాలకు స్మార్ట్ నిధులు కేటాయించి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి కార్యక్రమం జూన్ 3 నుండి 18 వరకు జరగనున్న నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి మార్గ నిర్దేశం చేయడం జరిగిందని అన్నారు.


ప్రజా ప్రతినిధులు - మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్‌లో గుండు సుధారాణి అధ్యక్షతన గురువారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మంచినీరు గత పట్టణ ప్రగతిలో తీసుకున్న వినతిపత్రాలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని సొంత పార్టీ కార్యకర్తల నుండి వ్యతిరేకత ఎదురైంది. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వాన కమీమ్ మసూద్, కార్పొరేటర్లు, బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సిపి వెంకన్న, సెక్రెటరీ విజయలక్ష్మి, సి.ఎం.హెచ్.ఓ రాజారెడ్డి, ఇంచార్జి సి.హెచ్.ఓ కిషోర్, బల్దియాలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.Next Story