దశాబ్దాలుగా మానని బుల్లెట్ గాయాలు..

by Dishaweb |
దశాబ్దాలుగా మానని బుల్లెట్ గాయాలు..
X

దిశ,మహబూబాబాద్ ప్రతినిధి: తెలంగాణ ఉద్యమంలో మానుకోట లో జరిగిన సమైక్య వాదుల తుపాకీ తూటాల ఘటన మరుపు రానిది.తుపాకీ తూటాలకు మానుకోట రాళ్లు ఎదురెళ్లిన ఘడియలు తెలంగాణ ఉద్యమానికి పునాది రాళ్లు.స్వరాష్ట్ర సాధన లో మానుకోట ఉద్యమ కారుల పాత్ర అమోఘమైంది.సమైక్య పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతి తో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర పేరుతో మానుకోట రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆయనకు మానుకోట తెలంగాణ ఉద్యమకారులు ఆయన ను అడ్డుకుని రాళ్ళ దాడి చేయగా,అప్పటి యంత్రాంగం ,పోలీసులు, నాయకులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఈ తూటాలకు ఎదురు నిలబడగా జిల్లా కు చెందిన 11 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి.

ఈ సంఘటన యావత్తు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ చైత్యనం ను రగలిచింది. ఎన్నో ఉద్యమాల ఫలితంగా స్వరాష్ట్రం సిద్దించింది. కానీ నేటికీ ఈ బాధితులకు భరోసా కరువైంది.ఉద్యమ రాష్ట్రంలో ఉద్యమ కారులు వేదనలు అన్ని ఇన్ని కావు. తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన మానుకోట రాళ్ల చరిత్ర. సీమాంధ్ర పాలకులు సమైక్యవాద సిద్ధాంతంతో పరామర్శ నెపంతో మానుకోట వస్తున్న సమైక్యవాద నాయకులను తరిమికొట్టిన చరిత్ర సృష్టించిన మానుకోట ఉద్యమకారులు.

అధికార బలంతో ఉన్న సీమాంధ్ర పార్టీల ప్రజాప్రతినిధులు తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం కుట్ర చేస్తున్నారన్న సమాచారంతో మానుకోట యువకులు వారి ఓదార్పు యాత్ర అడ్డుకునేందుకు సిద్ధపడ్డారు. సమైక్యవాద నినాదంతో ఓవైపు… ఉద్యమకారులు నిరసన మరో ఓవైపు.. మానుకోటను చుట్టుముట్టిన పోలీసుల వలయం ఇంకోవైపు… మానుకోట రైల్వేస్టేషన్‌లో అంతా టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితి. ఓదార్పు యాత్ర రద్దు చేయాలన్న ఇంటెలిజెన్స్ సమాచారం నివేదికలను సైతం పట్టించుకోని అప్పటి కాంగ్రెస్, సీమాంధ్ర నాయకులు అధికార బలంతో యాత్రకు సిద్ధపడ్డారు.

తుపాకీ చప్పుళ్లు..

సమైక్యవాద సిద్ధాంతంకు బలం చేకూర్చే విధంగా వ్యవహరించిన అప్పటి పోలీసులు తెలంగాణ ఉద్యమకారులను రెచ్చగొట్టే విధంగా అడుగులు వేశారు. తుపాకులతో భయపెట్టే ప్రయత్నం చేశారు. తుపాకుల ఎదురొడ్డిన మానుకోట యువకులపై పోలీసుల కాల్పులకు దిగారు.

పోలీసులే కాదు..

మానుకోట పోరులో పోలీసులతో పాటు కొంతమంది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సైతం తుపాకులతో ఉద్యమకారులను బెదిరించారు. తమనాయకుడి కంటే తెలంగాణ నినాదం ఎక్కువేమీ కాదన్నట్లు దుస్సాహసానికి తెర లేపారు.

రాళ్లే… బుల్లెట్లు

అధికార అహంకారంతో తుపాకులకు పని చెప్పిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడ్డాయి. పోలీసుల బుల్లెట్లకు ప్రతిస్పందిస్తూ విసిరిన మానుకోట రాళ్ల దాడికి సమైక్య పాలకులు వెనుదిరిగారు.

నిరీక్షణ.. అందని సహాయం

సమైఖ్య పాలకుల తుపాకీ తూటాలకు ఎదురు నిలిచిన సుమారు 11 మంది తెలంగాణ ఉద్యమకారులు నేటికీ నిరీక్షిస్తున్నారు. కళ్ళు, కాళ్లు, వీపు, తొడ భాగాలలో తుపాకీ గుండ్లలతో గాయాలు కాగా వీరిని అక్కున చేర్చుకునే వారు కరువయ్యారు. తుపాకీ తూటాలకు గాయాలైన వీరిని అప్పుడు వరంగల్ ఎంజీఎంకు చికిత్స నిమిత్తం తరలించగా ఉద్యమ రథసారథి కేసీఆర్ క్షతగాత్రులను పరామర్శించి ఒక్కొక్కరికి రూపాయలు పదిహేను వేలు ఆర్థిక సాయం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గాయపడ్డ ప్రతి ఒక్కరికి ఇంటికో ఉద్యోగం, 10 లక్షల ఆర్థిక సహాయం, డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. కేవలం ఐదు లక్షల రూపాయల చెక్కు ను అందజేసినట్లు వాపోతున్నారు.

నేటికి 13ఏండ్లు..

మానుకోట రాళ్ల దాడితో సమైక్య వలసపాలకులను తరిమికొట్టి సరిగ్గా 13 ఏండ్లు. ఇక్కడి రాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచాయి. మహిమగల రాళ్లు..మానుకోట రాళ్లు పేరిట పాటలు, పద్యాలు, పుస్తకాలు ఆవిష్కృతమయ్యాయి.

బుల్లెట్ ..బాధలు..

ఆంధ్రా పాలకుల పిస్టోల్ బుల్లెట్ గాయాలు ఇంకా మానలేదు.పెద్ద పనులు చేయలేక సాధారణంగా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆపరేషన్ చేయాలి..

-భూక్య శోభన్, రాజోలు గ్రామం‌,కురవి మండలం

నాకు ఎడమ కాలులో బుల్లెట్ దిగింది. అప్పుడు వైద్యులు చికిత్స చేశారు. ఆపరేషన్ చేయడం కుదరని, రెండు సంవత్సరాల తర్వాత చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికి 13 ఏండ్లు ఎవరు పట్టించుకోవడం లేదు. కాళ్ళు నడవనీయడం లేదు. మాకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇంకా ఇవ్వలేదు. కేసీఆర్ ను 3 సార్లు కలిసిన ప్రయోజనం లేదు. నేను డిగ్రీ, బీఎడ్ చదివాను. ఆపరేషన్ కోసం 3 లక్షల రూపాయలు కావాలి. ప్రభుత్వం ఆదుకోవాలి.

చస్తూ ..బ్రతుకుతున్న:భూమా ముదాకర్, బయ్యారం

నేను ఏం.ఏ, బీ.ఎడ్ పూర్తి చేశాను. కాల్పుల్లో కిడ్నీ నుంచి బుల్లెట్ పోయి డ్యామేజ్ అయింది. ఎడమ చేయి నుంచి బుల్లెట్ పోయింది. నేను హార్డ్ వర్క్ చేయలేక పోతున్నా. ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. నేను బతకడం కష్టం గా ఉంది. ప్రతి రోజు చస్తూ బతుకుతున్నా.

కొండ మురళి కాల్చాడు : సయ్యద్ హిమామ్, మాహబూబాబాద్

జగన్ యాత్రను అడ్డుకునేందుకు రాళ్ళ దాడి చేస్తున్న క్రమంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కొండా మురళి పిస్టల్ తో కాల్చాడు. మాది పేద కుటుంబం. బుల్లెట్ గాయాలతో గోస పడుతున్నాం. మా కుటుంబాలు దుర్భరంగా బతుకుతున్నాయి. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

బుల్లెట్ గాయాలైన వారు..

మాహబూబాబాద్ జిల్లా పరిధిలో.. భూక్య శోభన్, తోట రవి, సయ్యద్ హిమామ్, దిడ్డి వెంకటేష్, హచ్యా, భూమా ముదాకర్, కెలోత్ హత్తిరామ్, రావొజీ, బిక్యా, పౌల్ రాజు, రంగ్యా లకు గాయాలయ్యాయి.



Next Story

Most Viewed