అంబేద్కర్ ఆశయ సాధనలో నడవడమే మనమిచ్చే ఘనమైన నివాళి : అదనపు కలెక్టర్

by Disha Web Desk 20 |
అంబేద్కర్ ఆశయ సాధనలో నడవడమే మనమిచ్చే ఘనమైన నివాళి : అదనపు కలెక్టర్
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : భారత రత్న, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలోను, పాటించడంలోను కృషి జరిపినప్పుడే మనమిచ్చే ఘనమైన నివాళి అని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్ లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి అంబేద్కర్ చత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం సభను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్నిదేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దేశరాజ్యాంగాన్ని రచించడంతో మనందరికీ ప్రజాస్వామ్యం లభించిందన్నారు. అంటరానితనం, అసమానతలను రూపుమాపేందుకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభాతృత్వాన్ని సమానంగా అనుభవించే విధంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహానుభావుడని కొనియాడారు.

ప్రజలందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. ప్రభుత్వం అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నందునవినియోగించుకొని రాణించాలన్నారు. జిల్లాలో నాణ్యమైన విద్యకు గురుకులాలు ఏర్పాటు చేశారని, పోటీతత్వం పెంపొందించుకొని పట్టుదల, క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదవాలని కోరారు. విద్య ద్వారానే ఉన్నత స్థానానికి ఎదుగుతామని సమజాభివృద్ధికి పాటుపడ గలుగుతామన్నారు. దళిత బంధు పధకం ప్రవేశపెట్టి 305 మందికి మంజూరు చేశామని, అట్టడుగు, బడుగుబలహీన వర్గాల కుటుంబాల బలోపేతం కొరకు కృషి చేస్తున్నామన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతి చెక్కులు అందజేశారు. అంతకుముందు కోర్ట్ భవనం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. ఈ జయంతి మహోత్సవంలో డీఆర్డీఓ.సన్యాసయ్య, ఎస్సి కార్పొరేషన్ ఈడి బాలరాజు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఎర్రయ్య, విద్యాశాఖ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed