23 మంది కౌన్సిలర్లు గైర్హాజరు.. మున్సిపల్ సమావేశం వాయిదా

by Disha Web Desk 11 |
23 మంది కౌన్సిలర్లు గైర్హాజరు.. మున్సిపల్ సమావేశం వాయిదా
X

దిశ, జనగామ: జనగామ మున్సిపల్ 2023 - 24 వార్షిక బడ్జెట్ సమావేశం మంగళవారం వాయిదా పడింది. మున్సిపల్ లో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో ఏడుగురు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కాగా, మిగిలిన 23 మంది గైరాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 11 గంటలకు పోకల జమున సహా మరో ఆరుగురు కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. చైర్ పర్సన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభించారు. దాదాపు గంటపాటు మిగిలిన సభ్యులు హాజరవుతారని వేచి చూశారు. కానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది బీజేపీకి చెందిన నలుగురు మొత్తం 23 మంది కౌన్సిలర్లు ఈ బడ్జెట్ సమావేశానికి గైర్హాజరు కావడంతో సమావేశం చర్చనీయా అంశంగా మారింది.

అధికార పార్టీకి చెందిన11 మంది కౌన్సిలర్లు సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది అవిశ్వాస తీర్మానం మోపుతూ జిల్లా అదనపు కలెక్టర్ కు ఇప్పటికే లేఖ అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన సమావేశం రెండోసారి వాయిదా పడడం గమనార్హం. గత నెల 21న ఈ సమావేశం జరగాల్సి ఉండగా సరిగ్గా నెల రోజులకు వాయిదా పడింది. అయితే ఈసారి కూడా మెజారిటీ సభ్యులు హాజరు కాకపోవడంతో చైర్ పర్సన్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి తిరిగి రేపు (బుధవారం)కి వాయిదా వేశారు. అయితే ఈ బుధవారం కూడా సమావేశం జరగకపోతే మూడోసారి కౌన్సిల్ సమావేశం వాయిదా పడ్డట్లు అవుతుంది. సాంకేతిక కారణాల దృష్ట్యా చూస్తే ఇప్పటికే కౌన్సిలర్లు రెండుసార్లు సమావేశానికి హాజరు కాకపోవడంతో బుధవారం జరిగే సమావేశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈసారి చైర్ పర్సన్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంపై నిర్ణయం తీసుకునేందుకు కలెక్టర్ కు లేఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాంకేతికగా కోణంలో అధికారులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడోసారి గైర్హాజరైన వారిపై ఏమైనా చర్యలు ఉంటాయా? లేక వారి ప్రమేయం లేకుండానే బడ్జెట్ ను ఆమోదిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, రేపటి సమావేశంతో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Next Story

Most Viewed